గజ్వేల్, ఫిబ్రవరి 25: ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండపాక మండలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నయని, ప్రభుత్వం వెంటనే తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలను పంపింగ్ చేసి సాగునీరు అందించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి ఎండాకాలం ప్రారంభంలోనే కాలువల ద్వారా కొండపాక మండలంలోని గ్రామాలకు సాగునీళ్లు అందించిందని గుర్తుచేశారు.
మండలంలోని కొండపాక, దమ్మక్కపల్లి, సిరిసనగండ్ల, మర్పడగ, ఖమ్మంపల్లి, తిమ్మారెడ్డిపల్లి, గిరాయిపల్లి, జప్తినాచారం, దుద్దెడ గ్రామాల్లో సాగునీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు అధికారులకు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 200 మీటర్ల టన్నెల్ తొలిచారని, ప్రభు త్వం మారడంతో పనులు మధ్యలోనే ఆపేశారన్నారు.
టన్నెల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నుంచి కొండపాక మండలంలోని చెరువులను నింపి, సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలానికి సాగునీళ్లు అందించే అవకాశం ఉందన్నారు. తపాస్‌పల్లి టన్నెల్‌ను వెంటనే పూర్తి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగినట్లు తెలిపారు. జగదేవ్‌పూర్ కెనాల్ నుంచి మునిగడప చెరువులోకి నీళ్లు వచ్చేలా చూడాలన్నారు. సాగునీళ్లు వదలని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.