గజ్వేల్, నవంబర్ 1: అతి తక్కువ కాలంలో తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత కేసీఆర్‌దే అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనవాళ్లు, కనబడకుండా చేస్తామని రేవంత్‌రెడ్డి అనడం అతని తరం కాదన్నారు. నెంబర్ ఆలయంగా యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు, మిషన్ కాకతీయ మరమ్మతులతో నిండుకుండలా చెరువులు, కుంటలు కనిపిస్తాయన్నారు. రైతుబంధు, 24గంటల ఉచిత కరెం ట్, జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల నిర్మాణం, మోడల్ ఐవోసీ మార్కెట్లు, హరితహారంలో 285కోట్ల మొక్కలు నాటడం, సంక్షేమంలోనే దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పని చేసిన కేసీఆర్ గుర్తులను చేరిపేయడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిందని, సంక్షేమం అటకెక్కిందని, ఎక్కడా చూసిన ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్ల్లెక్కుతుండగా.. ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసితులు రోడ్లెక్కే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని 1.50కోట్ల మహిళలు ప్రభుత్వం తమకు ఎప్పుడు రూ.2500 ఇస్తదోనని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కుదేలైందని, నేటికి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేకపోయారని, పండించిన పత్తిని రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. త్వరలోనే రైతు గర్జన పేరుతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రూ.500 బోనస్ బోగస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ. రాజమౌళి, వైస్ చైర్మన్ జకీమొద్ద్దీన్, హజ్ కమిటీ మెంబర్ జాఫర్‌ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మెట్టయ్య, బాలమణి, కనకయ్య, అత్లెల్లి శ్రీనివాస్, అల్వాల బాలేశ్, మల్లేశం, నాయకులు దయాకర్‌రెడ్డి, నర్సింగరావు, ఆర్కే శ్రీను, ఉమర్, ఏల వెంకటేశం, అహ్మద్ పాల్గొన్నారు.