గజ్వేల్, నవంబర్ 22: ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని, టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కొండపాక, కుకునూర్‌పల్లి, గజ్వేల్ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిల్లులు రాక లబ్ధిదారులు అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈసారి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని మార్కెట్లో డబ్బులు పుట్టడం కష్టంగా ఉందన్నారు.
వ్యవసాయ భూముల ధరలు తగ్గడంతో అప్పు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇంటి నిర్మాణాలన్నీ అధికారులు ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం కారణంగా చాలావరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జిల్లా అధికారులు నేరుగా లబ్ధిదారులను కలిసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఒక్కో ఇంటిపై మరో రూ.10లక్షల వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారికి మంజూరు చేయడం లేదని, మంజూరైనవారు ఆర్థిక ఇబ్బందులతో కట్టుకోవడం లేదన్నారు. ఉచితంగా ఇసుక రవాణా చేస్తామని చెప్పి ప్రభు త్వం చేతులెత్తేయడం తగదన్నారు.
మార్కెట్లో టన్నుకు రూ.3 వేలు వెచ్చించి ఇసుకను కొనుగోలు చేస్తున్నారని, అప్పులు చేసి కట్టుకుంటున్న ఇంటికి వడ్డీలు కట్టలేని లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ జేజాల వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీ రవీందర్, ర్యాగల దుర్గయ్య, అనంతుల ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నూనె కుమార్, నాయకులు గొడుగు స్వామి, అమరేందర్, భద్రప్ప, ఆంజనేయులు, అనిల్, అహ్మద్, ఎల్లం, జిర్ర రాజు, రాజిరెడ్డి పాల్గొన్నారు.