గజ్వేల్, నవంబర్ 20: మంచి చేస్తాడని ప్రజలు ఓట్లేస్తే, గద్దెనెక్కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ రేవంత్‌రెడ్డి ఒక విఫల సీఎంగా మిగిలాడని బీఆర్ఎస్ గజ్వేల్ సెగ్మెంట్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలకు ఏమి చేశారని విజయోత్సవాలు జరుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, వందశాతం రుణమాఫీ చేయాలని, పింఛన్ రూ.4వేలు పెంచాలని, ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఆడబిడ్డలకు స్కూటీలు ఇవ్వాలని, కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇవ్వాలని, అన్నిరకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పేదల ఇండ్లను కూల్చినందుకా… రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నందుకా… ఎందుకు విజయోత్సవ సభలు నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. చేతకాక పిచ్చికూతలు కూస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని తిరోగమన బాట పట్టించిందని విమర్శించారు. ఏ ఊరికెళ్లినా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం కనబడుతుందని, రేవంత్‌రెడ్డికి కేసీఆర్ పెట్టిన భిక్షే ముఖ్యమంత్రి పదవి అన్నారు. కేసీఆర్ మహావృక్షమని, ఆయన ఆనవాళ్లు ఎక్కడకెళ్లినా కనిపిస్తాయన్నారు.