గజ్వేల్, జనవరి 21: కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలను పంచుకునేందుకే గ్రామసభలను ఏర్పాటు చేశారని, ఆరు గ్యారెంటీల పేరుతో 13 హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులను విడిచి కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలను ఇచ్చేందుకే సభలు నిర్వహిస్తూ, అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా పేదలకు పథకాలు అందించాలని, పక్షపాత ధోరణితో వ్యవహరించ వద్దని ప్రభుత్వానికి సూచించారు. భూమిలేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, నాయకులు ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన జాబితాలోని వారికే పథకాలను మంజూరు చేస్తే, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామసభల్లో ప్రజలు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, అనేక గ్రామాల్లో సభలను అడ్డుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే దరఖాస్తుల పేరిట ప్రభుత్వ డ్రామాలు ఆడుతున్నదని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందకుంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.