చేర్యాల, మే 31 : వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మిల్లర్లు ఎలాంటి కటింగ్‌లు పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. చేర్యాల-నాగపురి రహదారిపై ధాన్యానికి నిప్పుపెట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండమీది సంతోషికరుణాకర్, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. నాగపురి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తరుగు పేరిట రైస్ మిల్లర్లు రైతుల ధాన్యాన్ని కాజేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం సేకరణ కేంద్రం నుంచి మిల్లుకు నలుబైరెండున్నర కిలోల నుంచి 44కిలోల ధాన్యం బస్తా పంపిస్తేనే మిల్లర్లు ఆన్లోడ్ చేసుకుంటున్నారని, లేని పక్షంలో లారీ సరుకును రిజెక్ట్ చేస్తున్నారని వాపోయారు.ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించి 45 రోజులు పూర్తయినా ధాన్యం సేకరణలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున తేమశాతంతో సంబంధం లేకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సందీప్, రైతులు బాబు, వెంకటేశ్, దేవేందర్‌రెడ్డి, స్వామి, కరుణాకర్, సుధాకర్ పాల్గొన్నారు.