మెదక్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వచ్చే డిసెంబర్ 2023 నాటికి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు తట్టు, రుబెల్లా బారిన పడకుండా ప్రతి ఒకరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో మెసల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సినేషన్‌తో పాటు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలుపై నిర్వహించిన జిల్లా టాస్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తట్టు, ఒళ్లంతా దురదల వల్ల నిమోనియాకు దారితీసి ప్రాణహానికి అవకాశముందని, కాబట్టి తట్టు రాకుండా పిల్లలకు 9-10 నెలల్లో ఒకసారి, 18-24 నెలల్లో మరోసారి వ్యాక్సినేషన్ ఇప్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించి కొన్ని జిల్లాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని, వచ్చే డిసెంబర్ నాటికి వందశాతం వ్యాక్సిన్ ఇచ్చి నిర్మూలించేలా లక్ష్యం నిర్ధేశించిందన్నారు.
మెదక్ జిల్లాలో 94శాతం రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యిందని, సర్వేచేసి 5 ఏండ్ల లోపు పిల్లలను గుర్తించేందుకు సూక్షస్థాయి కార్యాచరణ రూపొందించి వంద శాతం వ్యాక్సిన్ వేసేలా కృషి చేయాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలును సమీక్షిస్తూ 1980లో సానింగ్ యంత్రాలు వచ్చినప్పటి నుంచి సెక్స్ నిష్పత్తి తగ్గుతున్నదని గుర్తించిన ప్రభుత్వం 1994లో ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలుపర్చేందుకు 2004లో చట్టంలో మార్పులు చేస్తూ రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ అధికారులను భాగస్వాములు చేసిందన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఏడు సంవత్సరాల వరకు శిక్ష, జరిమానా ఉంటుందన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మొదలు వివిధ స్థాయిల్లో ఉన్న చైన్ లింక్‌ను బ్రేక్ చేయడం ద్వారా ఈ సమస్యను రూపుమాపవచ్చన్నారు. జిల్లాలో 36 సానింగ్ కేంద్రాలున్నాయని, కొత్తగా 3 కేంద్రాలకు అనుమతి, రెండు కేంద్రాలకు రెన్యూవల్ చేయుటకు కమిటీ తీర్మానించిందన్నారు. అనుమతులతో నిర్వహిస్తున్న ప్రతి సానింగ్ సెంటర్, దవాఖానలను డెకాయ్ ఆపరేషన్ చేసి పురిటిలోనే బిడ్డను చిదిమేస్తున్నట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాళ్, చంద్రశేఖర్, విజయ నిర్మల, సుమిత్ర, నవీన్, మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.