మెదక్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు మళ్లీ ఆగమవుతాయని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో భూమి రిజిస్ట్రేషన్ కావడానికి ఏండ్ల తరబడి రిజిస్ట్రర్, తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లంచాలు, పైరవీలు చేస్తే తప్ప ఫైళ్లు ముందుకు కదిలేవి కాదు. భూ పరిపాలనలో ధరణి కొత్త శకానికి నాంది పలికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. అత్యంత పారదర్శకంగా, సులువుగా, వేగంగా భూ రిజిస్ట్రేషన్లు కావడానికి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెసోళ్లు ఎత్తివేయడానికి కుట్రలు చేసున్నారు. పాత పద్ధతిలో పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు పట్టాదారుకు తెలియకుండానే మరో వ్యక్తి పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. అన్ని విధాలా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే అన్నదాతలు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు పొలాల్లోనే తిష్టవేసుకుని కాపు కాసి కరెంటు వచ్చినప్పుడు పొలాలకు నీళ్లు పట్టేవారు. రాత్రి పూట చీకట్లో విష పురుగుల మధ్య సావాసం చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసేది. తెలంగాణలో వ్యవసాయ రంగం రూపురేఖలే మారిపోయాయి. సాగుకు 24 గంటల కరెంటు నిరంతరాయంగా అందుతున్నది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటర్ల వాడాలని చేసిన వాక్యలపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవానికి 10హెచ్‌పీ మోటర్ల వాడకం అనేది అమలుకు సాధ్యం కాదు. ఒక వేళ 10 హెచ్‌పీ మోటర్లు పెడితే మరమ్మతులు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అసలు 10హెచ్‌పీ మోటర్ కొనుగోలు కూడా రైతులకు ఎనలేని భారం. ప్రస్తుతం రైతులు వాడుతున్న మోటర్ల కెపాసిటీ కేవలం 3 హెచ్‌పీ లేదా 5హెచ్‌పీ వరకే ఉంది.
సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడంతోనే మా భూములకు విలువ పెరిగింది. గతంలో భూమి ఉన్న మాటే గాని ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఉండేవి కావు. ధరణితో భూములకు భద్రత ఏర్పడింది. కొత్త పట్టాదారు పాసుపుస్తకం రావడంతోనే రైతుబంధు, రైతుబీమా వస్తున్నది. గత ప్రభుత్వాల పాలనలో ఏండ్ల తడబడి సర్కారు ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు ఆ పని లేకుండా అంతా ఆన్లైన్లో చూసుకోవచ్చు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రైతులను మభ్యపెడుతున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నదే లేదు. ఓటుబ్యాంకుగా వాడకున్నారే తప్పా.. వ్యవసాయ రంగం బాగుపడడానికి ఎ ఒక్క పథకం అమలు చేయలె. విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు అమ్మడానికి కూడా రైతులు ఆరిగోస పడ్డరు. సమస్యలు పరిష్కారించాలని కోరినా.. నాడు లీడర్లు పట్టించుకున్నది లేదు. పదేండ్లుగా రైతుల మేలు కోరే ప్రభుత్వం ఉన్నది. సీఎం కేసీఆర్ వల్లే రైతులు సంతోషంగా బతుకుతున్నరు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో 5 హెచ్‌పీ మోటర్ల కింద పంటలకు నీరందించుకుంటూ రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నరు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో భూములన్నీ భద్రంగా ఉన్నాయి. పాస్‌బుక్కులో నుంచి ఎవరైనా తీసేసినా మా ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. వెంటనే రెవెన్యూ అధికారుల దగ్గరికి పోయి ప్రశ్నించొచ్చు. కాంగ్రెస్ ధరణిని తీసేస్తే దళారుల రాజ్యం వస్తుంది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసినోడు. అందుకే 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం ఇస్తుండు. ధరణి తీసుకొచ్చి భూములకు భద్రత కల్పించిండు. కాంగ్రెస్ పార్టీని రైతులెవరూ నమ్మరు.
కాంగ్రెస్ పాలనలో భూమి వేరొకళ్ల పేరు మీదికి మారాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. పొలం ఎంతుందో తెలుసుకోవాలంటే వీఆర్వోను బతిమిలాడి, పైసలిస్తేనే అప్పుడు రికార్డు బుక్కులు తీసి, గింత భూమి ఉన్నదని చెబుతుండే. భూమి కొన్నా, అమ్మినా పాసుబుక్‌లో పేరు ఎక్కాలంటే సార్లకు దండం పెట్టాల్సిందే. గతంలో ఇసువంటి బాధలు పడ్డా మాకోసం సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చిండు. దీంతో మినిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ అయితున్నది. పాస్‌బుక్ కూడా వెంటనే వస్తున్నది. భూమికి సంబంధించిన 1-బీ ఆన్లైన్లో తీసుకోవచ్చు. ధరణి వచ్చినంక ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పినయ్.
కాంగ్రోసోళ్ల రాజకీయ బతకుదెరువు కోసం మాలాంటి ఎంతోమంది రైతుల బతుకులను ఆగం చేసేందుకు కుట్ర చేస్తున్నరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పడ్డ కరెంట్ కష్టాలు ఇప్పటికీ గుర్తున్నయ్. అమలు కాని హామీలిస్తూ రైతులను గందరగోళంలో పడేస్తుండ్రు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉంటున్నం. సాగుకు 3 గంటల కరెంటే ఇస్తామంటే కాంగ్రెస్‌కు ఎట్లా ఓటేస్తాం. 10 హెచ్‌పీ మోటర్లు నడవాలంటే ఎక్కువ కరెంట్, నీళ్లు కావాలి. లేకపోతే మోటర్ కాలిపోతుంది. ఎట్లా జేసినా రైతులను ఆగం చేద్దామానే కాంగ్రెసోళ్లు చూస్తున్నరు.
3 గంటల కరెంట్ ఇయ్యనికి కాంగ్రెస్ గెలుస్తెనే గదా. మళ్లా మా రైతు బాంధవుడు గెలుస్తడు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తడు. చేతకాని హామీలు ఇచ్చి రైతులను గందరగోళంలో వేసి, పబ్బం గడుపుకోవాలనుకునే రేవంత్‌రెడ్డి వద్దు. ఆయన ఇచ్చే 3 గంటల కరెంట్ వద్దు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం గీ కరెంటు గిట్లనే ఉంటది. పంటలు బాగా పండుతయి.
కాంగ్రెసోళ్లు ఇస్తామన్న మూడు గంటల కరెంట్‌కు మూడు తీర్ల మోటర్లు పెట్టాలి. మూడు గంటల కరెంట్‌తో ఏం పారుతది. ఏం పండించుకుంటాం. పంటలు పండవు, ఎవుసం చేసేటోళ్లు ఒట్టిగా ఉండాలి. ఇప్పుడున్న కరెంట్ నంబర్ ఏక్ ఉంది. మూడు గంటల కరెంట్ దండుగ, మోటర్లు నడువయి. కాలం మంచిగుంది. కరెంట్ మంచిగుంది. పంటలు మంచిగా పండుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లేసుకుందామని ఇష్టమచ్చినట్లు చెప్తే నమ్మెటోళ్లు లేరు. వైండింగ్ వర్క్ చేస్తూ ఉపాధి పొందుతున్న మమ్మల్ని అన్యాయం చేద్దమనుకుంటున్నరు. 3, 5 హెచ్‌పీల మోటర్లయితేనే ఉపాధి దొరుకుతుంది. రైతులు 10 హెచ్‌పీల మోటర్లను బోరుబావిలో బిగిస్తే మూడు రోజులకే మోటార్ కాలిపోతది. బోరులో నీళ్లు కూడా ఉండవు. మోటర్ చెడిపోతే రైతు బాగు చేసేందుకు హైదరాబాద్‌కు పోవాలే. రైతులు, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నరు.
వ్యవసాయంపై రేవంత్‌రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదు. నోటికొచ్చినట్లు ఉత్తుత్తి మాటలు చెప్పిండు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలనలో రైతులు 5 హెచ్‌పీ అంతకంటే తక్కువ మోతాదు మోటర్లు పెట్టి వ్యవసాయం చేసేటోళ్లు. కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో ఎవరికీ తెలిసేది కాదు. కరెంట్ రాంగనే రైతులంతా ఒకేసారి మోటర్లు వేయడంతో ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయేవి. వాటిని రైతులే తీసుకుని పోయి రోజుల తరబడి కాపు కాస్తూ మరమ్మతులు చేయించుకునేది. ఇప్పడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెడితే కనీసం గంట కూడా నడవయ్. ఎంత పెద్ద బోర్‌బావి అయినా సరే గంట లోపే నీళ్లన్నీ ఎత్తిపోస్తయి. 10 మంది రైతులు ఒకేసారి మోటర్లు అన్ చేస్తే ఏ ట్రాన్స్ఫార్మర్ కూడా ఆగదు. 24 గంటల కరెంట్ ఉంటే రైతులు ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్లు పంటలకు నీళ్లు పెట్టుకుంటరు.
ధరణి పోర్టల్ ఉంటేనే రైతు భూమికి భరోసా. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే భూముల కాగితాలను వీఆర్వోలకు అందజేసివారు. రికార్డుల్లోకి ఎక్కించే వరకు తిరగాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ తిప్పలు లేవు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తహసీల్ కార్యాలయంలో నిమిషాల్లో తమ పేరుపైన భూమి రికార్డుల్లో నమోదువుతున్నది. పహాణీల వ్యవస్థ ఉన్నప్పుడు ఎంతో మంది భూములు వేరేవాళ్ల పేరిట మర్పిడి అయ్యాయి. అంత అవినీతిమయం ఉండేది. ఇప్పడా బాధలేదు. మన భూమి మన చేతిలోనే ఉంటుంది.
మూడు గంటల కరెంట్ వస్తే మూడు తెర్లు అవుతాం. ఎక్కువగా రైతులకు బోరుమోటర్లు ఉన్నాయి. అవి నడవాలంటే కరెంట్ కావాలి. ఆ కరెంట్ మూడు గంటలు వస్తే ఏం పారుతది. కరెంట్‌తోనే పనంంతా. కరెంట్ లేకపోతే కలియుగం మునిగినట్లే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరిగ్గా రాక సింగిల్ ఫేజ్, టూ ఫేజ్, త్రీ ఫేజ్ అని, ఆ కాయలు, ఈ స్టార్టర్లు అంటూ ఎన్నో పైసలు ఖర్చు చేసేటోళ్లం. ఇప్పుడు కరెంట్ మంచిగుంది. నిమ్మలంగా ఉంది.
గత ప్రభుత్వ హయాంలో కరెంట్ కోసం పడరాని పాట్లు పడే వారం. ఇప్పుడు ఆ బాధ లేదు. రాత్రి పూట కరెంట్ కోసం పొలాల వద్ద పడుకునే వారం. పాములు,తేళ్లు రాత్రంతా మమ్మల్ని భయపెట్టేవి. దీంతో రాత్రి నిద్ర లేకుండా జాగారం చేసిన రోజులు ఎన్నో.. ఇప్పుడు అలాంటి బాధలు లేవు. కేసీఆర్ సార్ పుణ్యమని హాయిగా ఇంటి వద్దే నిద్ర పోతున్నా.
మాకు కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటే గావాలే. కాంగ్రెసొళ్ల మూడు గంటల కరెంట్‌తో మా బోర్లు నడువయి. మేము కాంగ్రెస్ మాటలు అస్సలు నమ్మం. రైతులకు రైతుబంధు, రైతుబీమా, మా బిడ్డలకు కల్యాణలక్ష్మి, మాకు పింఛన్లు ఇస్తున్న కేసీఆర్‌నే కోరుకుంటున్నం. మల్లగూడా ఆ సారునే గెలిపిస్తం.
కాంగ్రెసోళ్లు ఇస్తామంటున్న మూడు గంటల కరెంట్‌తో అద్ద ఎకరం కూడా పారదు. ఆపుకుంటా పోసే మోటర్లతో మూడు గంటల కరెంట్ ఇస్తే ఏం సరిపోతుంది. పూర్తిగా బోర్ల మీద ఆధారపడి ఎవుసం చేస్తున్నాం. 24 గంటల కరెంట్ ఉంటే పంటలు మంచిగా పండుతాయి. కరెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కరెంట్ మీదనే వ్యవసాయం ఆధారపడి ఉంది.
రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్ ఇస్తానంటడు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటిస్తే ఎవుసం అయితదా? 24 గంటలుంటే ఎప్పుడంటే గప్పుడు పోయి మోటర్ ఏసుకుని నీళ్లు పారాబెడుతం. అంతేగాని గెలువక ముందే రేవంత్‌రెడ్డి కరెంట్ మీద గిట్లంటుండు. ఇగ గెలిచినంకా ఇంకా ఏముందో? గందుకే గీ కాంగ్రెసోళ్లను నమ్మను.. ఓటెయ్యను.