మిరుదొడ్డి, ఆగస్టు 15 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, అల్వాల-చెప్యాల క్రాస్ రోడ్డులోని రైతుసేవా కేంద్రానికి శుక్రవారం యూరియా లారీలు వచ్చాయి. దీంతో యూరియా తీసుకెళ్లడానికి ఆయా గ్రామాల రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. వ్యవసాయ అధికారులు పోలీస్ పహారా మధ్య పట్టా పాస్బుక్కు పై రెండు యూరియా బస్తాలు రైతులకు అందజేశారు. అల్వాల-చెప్యాల క్రాస్ రోడ్డులో యూరియా దొరకని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. రైతులు చేస్తున్న ధర్నా తెలిసి మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం, మిరుదొడ్డి ఎస్సై సమత అక్కడికి చేరుకొని రైతులకు సరిపడా యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అక్కన్నపేట, ఆగస్టు 15: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో యూరియా కోసం రైతులకు పడిగాపులు, పాట్లు తప్పడం లేదు. ది విశాల పరపతి సహకార సంఘం లిమిటెడ్ హుస్నాబాద్ ఆధ్వర్యంలో అక్కన్నపేటలో కొనసాగుతున్న ఎరువులు, విత్తనాల కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… పదిహేను రోజుల నుంచి మండల కేంద్రంలోని సింగిల్విండో, ఆగ్రో, రైతు మిత్ర, ప్రైవేటు పర్టిలైజర్ దుకాణాలతో పాటు గౌరవెల్లి, కట్కూరు, రామవరం, మల్లంపల్లి, జనగామ గ్రామాల్లోని ఎరువుల షాపుల్లో యూరియా దొరకడం లేదన్నారు. ప్రస్తుతం వరినాట్లు కలుపు, పొట్ట దశల్లో ఉన్నాయని, ఇప్పుడు యూరియా అందకపొతే దిగుబడి రాక పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం పడిరాని పాట్లు పడుతున్నామన్నారు. షాపుల వద్ద చెప్పులు, పాసుబుక్కుల జిరాక్స్ పెట్టి క్యూ కడుతున్నామని, ఒక్క పాసుబుక్కు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారన్నారు. ఉదయం వస్తే సాయంత్రం వరకు కూడా షాపుల వద్ద ఉంటే యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తొగుట, ఆగస్టు 15: వర్షాలు కురుస్తున్నందున వరి, మక్క పంటలకు యూరియా తక్షణమే అవసరం ఉన్నందున రైతులు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఏకలవ్య ఫౌండేషన్ వద్ద రైతులు పడిగాపులు కాశారు. గంటల పాటు వేచి ఉంటే ఆధార్ కార్డుకు రెండు యూనియా బస్తాలు ఇచ్చారు. అదనంగా మరో నానో బాటిల్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.
చిన్నశంకరంపేట, ఆగస్టు 15: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రెండు రోజుల నుంచి యూరియా కొరత ఏర్పడింది. మండలంలో నాలుగు సహకార సంఘాలు ఉండగా, శుక్రవారం చిన్నశంకరంపేట సహకార సంఘానికి 560 యూరియా బస్తాలు వచ్చాయి. యూరియా వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు సహకార సంఘం భవనం ఎదుట బారులు తీరారు. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించినా కొందరు రైతులకు యూరియా దొరకలేదు. ఏవో లక్ష్మీప్రవీణ్ ఆధ్వర్యంలో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను అందించారు.