నిజాంపేట, డిసెంబర్ 18: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం నిజాంపేట, కల్వకుంట సొసైటీలతో పాటు ఓ ఫర్టిలైజర్ దుకాణానికి మూడు లారీల యూరియా లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు భారీగా వచ్చి క్యూలో నిల్చున్నారు. కల్వకుంటలో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే మూడు లారీలు ఖాళీ అయ్యాయి. యాసంగి సాగు ప్రారంభ దశలోనే యూరియా పరిస్థితి ఇలా, ఉంటే తర్వాత ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే నయముండే..
కేసీఆర్ ఉన్నప్పుడు మాలాంటి రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండే. గతంలో పంటలకు యూరియా చల్లాలంటే ఎప్పుడుపోయినా కల్వకుంట సొసైటీలో యూరియా దొరుకుతుండే. వెంటనే యూరియా సంచులను ఆటోలో తీసుకొచ్చి పంటలకు చల్లి ఇంటికి వచ్చేవాళ్లం. టైంకు యూరియా అందడం వల్ల ఏ బాధ లేకుండా పోయింది. 4 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంట ఏసిన. ఆ పంటలకు యూరియా చల్లుదామంటే లైన్లో నిలుసుండుడు అవుతుంది.
– ఎల్లయ్య రైతు, రజాక్పల్లి, నిజాంపేట మండలం
సరిపడా యూరియా అందజేయాలి
మొన్నటి వరకు పడ్డ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి బోర్ల నుంచి నీళ్లు ఎక్కువయ్యాయి. 2 ఎకరాల వరకు మొక్కజొన్న పంట వేసిన. దిగుబడి కోసం పంట బాగుండాలని యూరియా కోసం సొసైటీ వద్దకు వెళ్తే క్యూలో చాలామంది రైతులు నిల్చున్నారు. సరిపడా యూరియాను ప్రభుత్వం అందజేయాలి.
– వొజ్జ మల్లయ్య రైతు, రజాక్పల్లి, నిజాంపేట మండలం (మెదక్ జిల్లా)