సిద్దిపేట, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్ యాసంగి సాగు ప్రారంభంలోనే రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఒక సారి యాప్ అని, మరో సారి కార్డులు అంటుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సాగు పనులు చేసుకోవాలా..? యూరియా కోసం వ్యవసాయాధికారులు, ఫరిలైజర్ దుకాణాల చుట్టూ తిరగాలా..? అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏయాప్ లేకుండా రైతులకు నేరుగా ఎరువులు దొరికాయి.
ఇప్పుడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు తీసుకువచ్చిన యూరియా యాప్ జిల్లాలో రాకపాయే మళ్లీ జిరాక్స్ పేపర్లు, పట్టాదారు పాస్‌బుక్కులు పట్టుకొని వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎరువులు ఇస్తే ఇన్ని కష్టాలు ఉండవు కదా …ఆదిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచనచేయడం లేదని రైతులు మండిపడుతున్నారు.
యూరియా యాప్ రైతులకు మరింత ఇబ్బందులు తీసుకువచ్చింది. సర్వర్ డౌన్‌తో సాంకేతిక సమస్యల వల్ల యాప్ సక్సెస్ కావడం లేదు. రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో తప్పా ఎక్కడ కూడా యాప్ సక్సెస్ కాలేదు. సిద్దిపేట జిల్లాలో యాప్ రాకపోవడంతో యాసంగి సాగుకు సంబంధించి రైతులకు యూరియా ఇబ్బందులు తొలిగించాలనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా కార్డు పంపిణీ చేయిస్తున్నారు. ఈ కార్డులో పంటల నమోదుతో పాటు ఎరువుల మోతాదు తదితర వివరాలు పొందుపరుస్తున్నారు. ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశాడు..? ఏ మేరకు యూరియా అవసరం ఉంటుంది. ? ఎక్కడ యూరియా తీసుకున్నారు.. ? ఎన్ని బస్తాలు తీసుకున్నారు..? తదితర పూర్తి వివరాలతో సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రాన్ని రూపొందించారు.
ఈ విధానంలో రైతులకు కార్డులు పంపిణీ చేసి యూరియా కొరతను అధిగమించాలని కల్టెకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా గత వానకాలంలోనే తయారు చేసిన కార్డును వినియోగిస్తున్నారు.ఈయాసంగి పంటల సాగు కోసం కార్డుల ద్వారా యూరియా పంపిణీ చేయడానికి గ్రామాల్లో ప్రతి రైతుకు కార్డు అందేలా ఆయా గ్రామాల్లోని ఏఈవోల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు తమ ఒరిజినల్ పట్టాపాస్ బుక్, ఆధార్‌కార్డుతో పాటు జిరాక్స్ కాపీలను తీసుకువెళ్లి సంబంధిత వ్యవసాయాధికారితో కార్డు రాయించుకుంటున్నారు. లింక్ ఉన్న ఫోన్ నంబర్ కూడా రాయించాలి. రెండు మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలతో రైతులకు కార్డు లు పంపిణీ చేస్తున్నారు.
యూరియా యాప్ స్థానం లో పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం కార్డు విధానాన్ని తీసుకువచ్చారు. యూరియా యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట జిల్లాలో కార్డు విధానం అమలు చేస్తున్నారు. ఈకార్డులో …కార్డు సంఖ్య, పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్,విస్తీర్ణం (ఎకరాల్లో) రైతు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, ఆవాసం, రెవెన్యూ గ్రామం, క్లస్టర్ పేరు, మండలంతో పాటు రైతు సాగు చేసిన పంటల వివరాలు, విస్తీర్ణంలో ఎకరాలు, ఎరువులు (బస్తాలు) పొందిన బస్తాల సంఖ్య, ఎరువుల దుకాణం పేరు, బిల్ నెంబర్, తేదీ, డీలరు సంతకం, ముద్ర, రైతు సంతకం వివరాలతో కూడిన కార్డు మండల వ్యవసాయాధికారి సంతకంతో రైతుకు అందజేస్తున్నారు.
రైతు తన క్లస్టర్ పరిధిలో యూరియా లేకపోతే మండలంలో ఎక్కడికైనా వెళ్లి ఆ కార్డు చూపి యూరియా పొందవచ్చు అని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆయా ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుల సమయం కూడా వృథా కాదు అని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది జరుగుతుందా..? నిజంగా సకాలంలో ఎరువులు వస్తాయా..? కార్డు తీసుకుపోయినా క్యూలు ఉండవన్న గ్యారంటీ ఏంటి అని రైతులు తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే అరకొర యూరియా వస్తుంది. దీంతో రైతులకు ఎప్పటిలాగానే ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు క్యూలో పట్టాదారు పాస్ బుక్కులు, చెప్పులు, రాళ్లు పెట్టారు. ఇప్పుడు ఈ కార్డులు పెట్టాల్సి వస్తుందేమో అని రైతులు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో కొత్తగా యాప్ స్థానంలో కార్డులు ఇస్తున్నారు. ఈకార్డు ఉంటేనే యాసంగి పంటల సాగుకు యూరియా అందిస్తారు. దీంతో కార్డు నమోదు చేయించుకోవడానికి రైతులు పరుగులు పెడుతున్నారు. ఆయా క్లస్టర్లలో రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఒక ఎకరం వరి పంట సాగు చేస్తే మూడు యూరియా బస్తాలు, మొక్కజొన్న సాగు చేసిన వారికి ఎకరానికి నాలుగు బస్తాలు, వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రెండు బస్తాలు ఇవ్వనున్నారు. దీని ప్రకారం రైతులు సాగు చేసిన పంటల ప్రకారం ఎరువుల మోతాదు కార్డులో నమోదు చేస్తున్నారు.
ఇలా నమోదు చేసిన కార్డుతో ఎకరం వరకు ఒకేసారి రైతులకు కావాల్సిన బస్తాలు ఇస్తున్నారు. మిగతావి ఎకరం నుంచి మూడు ఎకరాల వారికి రెండుసార్లు, మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు మూడుసార్లు, ఐదెకరాల పైన ఉన్నవారికి నాలుగుసార్లు యూరియా పంపిణీ చేస్తారు. ఒక సారి యూరియా తీసుకున్న తర్వాత ఆరైతు తిరిగి మళ్లీ 14 రోజుల తర్వాత (కార్డులో రాసిన విధంగా బ్యాలెన్స్ ఉంటేనే) రెండోసారి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఫిర్టిలైజర్ షాపులవారు రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. యూరియా కోసం పోయిన రైతులకు వివిధ రకాల ఫెస్టిసైడ్ మందులు కొనుగోలు చేస్తేనే ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
యూరియా కోసం గింత తిప్పలు ఎప్పుడు పడలే. నిన్నమొన్ననేమో యూరియా కోసం ఫోన్లో యాప్ అన్నరు. ఇప్పుడేమో కార్డులు అంటున్నరు. కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినం. కార్డులొచ్చినంక యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుకు పోతే గడ్డి మందు కొంటేనే యూరియా బస్తా ఇస్తమంటున్నరు. ఎకరానికి రెండు బస్తాలే ఇస్తామని చెబుతున్నారు. యూరియా లేకపోతే ఎవుసం ఎట్ల చేసుకునేది. గిట్లయితే ఎవుసం బంద్ చేసి ఏపట్నమన్న పోయి బతుకాలనిపిస్తుంది. రైతులను ఇబ్బంది పెడితే సర్కారుకు ఏమొస్తది. సరిపడా యూరియా అందించాలే లేకపోతే రైతులంతా ఎవుసం చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి.
– తవిటి సత్యనారాయణ, రైతు, గాగిళ్లాపూర్, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా
బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. లారీల్లో యూరియా తీసుకువచ్చి సరఫరా చేయించిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్‌కే దకింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం నానా తంటాలు పడుతున్నాం. రైతులకు సకాలంలో యూరియా అందిం చకుంటే ధర్నాలు, రాస్తారోలు చేస్తాం.
– దాసరి సత్తయ్య, రైతు, గాజులపల్లి, దౌల్తాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా
యూరియా కొరత ఇబ్బంది పెడుతుంది. పోయిన వానకాలం, ప్రస్తుత యాసంగి సీజన్లో రైతుల అవసరంమేరకు యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి యాప్, యూరియా కార్డులు అందిస్తే వాటిపై తమకు ఎలాంటి అవగాహన లేదు. వ్యవసాయాధికారులు ముందస్తు అవగాహన కల్పించడం లేదు. యూరియా కోసం మళ్లీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు. వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎంతోమేలు చేసిన కేసీఆర్‌ను ఎప్పుడూ మర్చిపోలేం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎకరాకు రెండు బస్తాలు యూరియా కోసం గంటల తరబడి క్యూలో ఉన్నా దొరకడం లేదు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
– బాగాగౌడ్, రైతు, కొత్తపల్లి, రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా