హుస్నాబాద్ టౌన్, మార్చి 25: హుస్నాబాద్ పట్టణ సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు చేసి ఐదు నెలలు గడిచినా పనుల్లో పురోగతి ఉండడం లేదు. హుస్నాబాద్ పట్టణంలోని గాంధీచౌరస్తా, అంబేద్కర్, నాగారం రోడ్, కరీంనగర్ రోడ్‌లోని మడద వై జంక్షన్ల అభివృద్ధి పనులకు సెప్టెంబర్ 2న బీసీ సంక్షేమం, రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో చేపట్టే సర్కిళ్ల అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఒక్కో ప్రాంతంలో సర్కిళ్ల అభివృద్ధికి రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. డీపీఆర్‌ను విఘ్నేశ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి అధికారులు అప్పగించారు. ఇప్పటి వరకు కేవలం గాంధీచౌరస్తాలో మాత్రమే పనులు పూర్తిచేశారు. మిగిలిన మూడు ప్రాంతాల్లో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
ముఖ్యంగా కరీంనగర్, మడద రోడ్డు వద్ద వైజంక్షన్ ఏర్పాటు స్థలం వివాదంతో నిలిచిపోయాయి. ప్రభుత్వ స్థలం కాదని, తమసొంత స్థలంలో పనులు ఎలా చేస్తారంటూ స్థలానికి చెందిన పట్టాదారులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసే జంక్షన్ అభివృద్ధికి కావాల్సిన స్థలం గురించి ఎవరూ పట్టించుకోక పోవడంతో పనులు మొదలు కాలేదు. దీంతో పాటు నాగారం రోడ్లో సైతం జంక్షన్ అభివృద్ధికి సరైన స్థలం సరిపోక ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ, అక్కడ కూడా సుందరీకరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. హుస్నాబాద్ పట్టణాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. కానీ, అభివృద్ధి పనులు వేగంగా జరగడం లేదని విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పట్టణంలో పలుచోట్ల సుందరీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. గాంధీచౌరస్తాలో పనులు పూర్తిచేశాం. కరీంనగర్ రోడ్డులో పనులు చేపట్టేందుకు స్థలంపై అధికారులకు నివేదిక పంపించాం. మిగతా ప్రాంతాల్లో త్వరలోనే సుందరీకరణ పనులు చేపడతాం.
– పృథ్వీరాజ్, మున్సిపల్ ఏఈ, హుస్నాబాద్