రామచంద్రాపురం, జూన్ 5: కార్మిక నాయకుడిగా చివరి శ్వాస వరకు కార్మికుల పక్షాన పోరాడడమే కాకుండా తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పోరాడిన గొప్ప ఉద్యమనాయకుడు జి.ఎల్లయ్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని జి.ఎల్లయ్య ఎన్క్లేవ్ ముఖద్వారంలో 85వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఎల్లయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ& ఎల్లయ్య కేవలం ఒక కార్మిక నాయకుడిగానే కాకుండా చివరి శ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడని అభివర్ణించారు. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు, ఆయన సేవలు అందుకోని వారు ఎవరూ లేరన్నారు. ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, భెల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా ఎదిగి కార్మికుల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఆనాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సమయంలో ఎల్లన్న కార్మికుల కోసం పోరాడి ఎంఐజీ-2కాలనీని సాధించారని గుర్తుచేశారు. ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వారి కోసం ఇక్కడి స్థానిక రిజర్వేషన్లు తొలిగించినప్పుడు తన ప్రాణం పోయినా సరే..భూములు కోల్పోయిన తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని పోరాడిన గొప్ప స్థానిక పక్షపాతి అన్నారు.

1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో డీసీఎం నుంచి దూకి రెండు కాళ్లు విరిగినా, దవాఖానలో మంచంపై నుంచే జైతెలంగాణ అని నినదించిన పోరాట పటిమ ఆయనది అని కొనియడారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పిలుపునివ్వగానే అం డగా నిలిచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బలంగా వినిపించారని గుర్తుచేశారు. తన ఆరోగ్యం, కుటుంబం గురించి కాకుండా నిరంతరం కార్మికులు, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచించిన నిస్వార్థ నాయకుడు కాబట్టే, ఈరోజు పార్టీలకు అతీతంగా అంద రూ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని హరీశ్‌రావు అన్నారు. తెల్లాపూర్‌లోని ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ సమస్య వచ్చినప్పుడు ఎల్లన్న, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సోమిరెడ్డి తన వద్దకు వచ్చారని, నాటి సీఎం కేసీఆర్‌తో రాత్రి 10గంటలకు ఫోన్లో మాట్లాడి కేవలం గంట వ్యవధిలో ఆర్డర్స్ తెప్పించి జి.ఎల్లయ్య ఎన్క్లేవ్ ఏర్పాటుకు అండగా నిలిచామని హరీశ్‌రావు గుర్తుచేశారు.
జి.ఎల్లయ్య ఎన్క్లేవ్ ఆవరణలో ప్రస్తుతం ఆవిష్కరించిన విగ్రహం ఎల్లన్న స్థాయికి సరిపోలేదని హరీశ్‌రావు అన్నారు. ఎల్లన్న ఎప్పుడూ తెల్లటి ధోతితో నిలువెత్తు కనిపించేవారని, ఆయనకు తగ్గటుగా 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని హరీశ్‌రావు కోరారు. రాబోయే రెండు నెలల్లో రానున్న ఎల్లన్న వర్థంతి నాటికి ఎల్ఐజీ సర్కిల్లో గానీ, తగిన స్థలంలో గానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత ఎమ్మెల్యేకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే అక్కడ సమావేశంలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు.

హరీశ్‌రావు సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గొప్ప కార్మిక పక్షపాతి ఎల్లన్న అని కొనియాడారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు సొంత ఖర్చుతో 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎల్లన్న వర్థంతి వరకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇనేచార్జి ఆదర్శ్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు సత్తయ్య, ఐఎన్టీయూసీ నాయకుడు రెహమాన్, మహిళా కమిషన్ సభ్యురాలు శశికళయాదవ్రెడ్డి, ఎల్లయ్య కుమారుడు విజయ్, బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, దేవేందర్‌యాదవ్, కాల్వగడ్డ రాజ్‌కుమార్, అంజయ్య, రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీశైలం, పాండురంగారెడ్డి, బాబ్జీ, కాట సునిత, సాయిచరణ్‌గౌడ్, కృష్ణకాంత్, మేరాజ్‌ఖాన్, బాలయ్య, సత్యనారాయణ, విజయ్, కాంగ్రెస్ నాయకులు పుష్పానగేశ్, భరత్, సీపీరెడ్డి, ఎల్.రవీందర్, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-కార్మిక పక్షపాతి ఎల్లయ్య