జహీరాబాద్/రామాయంపేట/గజ్వేల్/సదాశివపేట్/జిన్నారం/గుమ్మిడిదల, ఏప్రిల్ 3: ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్లో పిడుగుపడి 20 గొర్రెలు మృతిచెందాయి.
గ్రామానికి చెందిన లక్ష్మి, భర్త లచ్చయ్య రోజు మాదిరిగానే గురువారం మేకలను మేపేందుకు ఊరు శివారుకు వెళ్లగా, సాయంత్రం పిడుగుపడి 20 గొర్రెలు మృతి చెందాయి. జిన్నారం మండలంలో సాయం త్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయంగా మారాయి. గుమ్మడిదల మండల కేంద్రం, బొంతపల్లి, అన్నారం, కొత్తపల్లి, నల్లవల్లి, మంబాపూర్ గ్రామాల్లో వాన పడింది. వర్షం వరి పంటలకు మేలు చేయగా, మామిడి, కూరగాయల పంటలకు నష్టం చేసినట్లు రైతులు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కోతకు వచ్చిన జొన్న, శనగ, గోధుమ, కూరగాయలు, పండ్ల తోటలకు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం మూడు గంటల పాటు ఏకధాటిగా కురవడంతో వీధులన్నీ జలమయం అయ్యాయి. రామాయంపేట పట్టణంలో ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు నిలిచింది.
గజ్వేల్ పట్టణానికి చెందిన ఇమ్మత్ఖాన్(55) మండలంలోని జాలిగామలో నూతనంగా నిర్మిస్తున్న గోదాంలో ఎలక్ట్రికల్ పనిచేసేందుకు వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గోదాం ప్రహరీ కుంగిపోయింది. ఇది తెలియక దాని పక్కకే మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు గోడకూలి మీద పడడంతో ఇమ్మత్ఖాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మధ్యాహ్నం సమయంలో కుటుంబసభ్యులు ఇమ్మత్ఖాన్కు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే సోదరుడికి సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు అక్కడికి చేరుకొని గోడ పక్కన వెతకగా విగత జీవిగా కనిపించాడు.