రాయపోల్, మే 20: అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసినా తేమశాతం పేరుతో వడ్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లిలోని ఐకేపీ కేంద్రా ల్లో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వడ్లపై కప్పిన టార్పాలిన్ కవర్లపై నీటిని ఎత్తిపోయడం, మళ్లీ కప్పుడం రైతులకు తప్పడం లేదు. ధాన్యం త్వరగా కొంటామని ప్రభు త్వం చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కొనుగోలులో ఆలస్యం, మరోవైపు వర్షాలతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.