గజ్వేల్, ఫిబ్రవరి 24: మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులు చేపట్టారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో గజ్వేల్ పట్టణంలోని పలు కాలనీల్లో వేసిన యూజీడీ చాంబర్ల ద్వారా మురుగు పైకి ఉబికి వస్తున్నది. చాంబర్ల నుంచి మురుగు ఇండ్ల మధ్యన వేసిన చాంబర్ల గుండాపైకి రావడంతో ముక్కులు పగిలే దుర్గంధ వెదజల్లుతుండడంతో ప్రజలు ఆ వాసన భరించలేకపోతున్నారు. రూ.155 కోట్లతో యూజీడీ పనులు చేపట్టారు. పర్యవేక్షణలో భాగంగా చాంబర్లను శుభ్రం చేయడంలో చొరవ తీసుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యను బల్దియా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.గజ్వేల్ మున్సిపాలిటీలో రూ.155 కోట్లతో 138 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగు నీటి పైప్లైన్(యూజీడీ), నాలుగు చోట్ల సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీలు) నిర్మాణం చేపట్టారు. యూజీడీ ద్వారా పట్టణంలో సుమారు 9500 పైచిలుకు ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, వంద శాతం ఇండ్లకు ఇవ్వలేకపోయారు. ఇంకా వందల సంఖ్యలో ఇండ్లకు యూజీడీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండడంతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ పట్టణ వాసులు తిరుగుతున్నారు. అధికార యంత్రాంగం దీనిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
యూజీడీ చాంబర్లను క్లీనింగ్ చేయాలంటే తప్పనిసరి జెట్టింగ్ యంత్రాలు కావాల్సి ఉంది. కానీ, యూజీడీ పనులు చేసిన సంబంధిత కాంట్రాక్టర్కు నేటికి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించక పోవడంతో పనులు మధ్యలోనే వదిలేశారు. దీంతో తరుచూ కాలనీల్లో చాంబర్ల నుంచి మురుగు బయటకు పొంగిపొర్లుతున్నది. దీంతో రోడ్డుపై కాలినడకన నడవలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
చాంబర్ల లీకేజీలతో ప్రజలు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు. యూజీడీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సమస్య మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ యూజీడీ చాంబర్లు నిండినా వాటిని క్ల్లీనింగ్ చేయడానికి జెట్టింగ్ యంత్రాలు అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు జెట్టింగ్ యంత్రాలను తీసుకురాకపోవడంతో లీకేజీ అవుతున్న చాంబర్లను శుభ్రం చేయడంలో అలస్యం కారణంగా దుర్గంధం వెదజల్లుతున్నది.
గజ్వేల్ పట్టణంలోని 2,9,14వ వార్డుల్లో యూజీడీ చాంబర్లు నిండి మురుగు పైకి వస్తుండడంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని కాలనీ వాసులు వాపోతున్నారు. చాంబర్ల నుంచి మురుగు పైకి వచ్చి రోడ్లపైకి చేరడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గతంలో ఇదే పరిస్థితి వస్తే అధికారులు అప్పటి వరకు ఉపశమనం కలిగించేలా శుభ్రం చేశారు. కానీ, సమస్య కొద్ది రోజులుగా తరుచూ సమస్య ఎదురవుతుండడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్టెల్ టవర్ కాలనీ, లక్ష్మీప్రసన్న నగర్, పాత గజ్వేల్, బీడీ కాలనీ సమీపంతో పాటు మరిన్ని గల్లీల్లో తరుచూ ఇదే సమస్య ఎదురవుతున్నది.
మురుగు సమస్య పరిష్కారానికి జెట్టింగ్ మిషన్ తప్పనిసరి కావాల్సి ఉంది. మున్సిపాలిటీలో అందుబాటులో లేకపోవడంతో వేరే మున్సిపాలిటీ నుంచి తెప్పించి సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాం. పనులు చేసిన కాంట్రాక్టర్కు రూ.50కోట్ల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేశారు. దీంతో సమస్య తరుచూ తలెత్తుతున్నది. యూజీడీ చాంబర్ల ద్వారా మురుగుపైకి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్నాం.
-గోల్కొండ నర్సయ్య, కమిషనర్ మున్సిపల్ గజ్వేల్