సంగారెడ్డి ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు సొంతపార్టీకి చెందిన రెబల్స్ ము చ్చెమటలు పట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉన్నాయి. 256 వార్డులకు మొత్తం 769 మంది కాంగ్రెస్ నాయకులు నామినేషన్లు వేశారు. ఒక్కోవార్డులో కాంగ్రెస్ పార్టీ పేరిట ముగ్గురు నుంచి నలుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తుది అభ్యర్థుల ఖరారు, బీఫామ్‌ల పంపిణీ కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది.
ఒకరికి పార్టీ బీఫామ్ ఇస్తే నామినేషన్లు వేసిన మిగతా కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి పార్టీ విజయావకాశాలను గండికొడతారని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మధ్యా హ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. దీంతో రెబల్స్‌గా ఉన్న కాంగ్రెస్ నాయకులు బరి నుంచి తప్పుకునేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రెబల్స్ నాయకులను పిలిపించుకుని బరి నుంచి తప్పుకోవాలని బుజ్జగించడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పదవుల ఆశలు చూపిస్తున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులకు కాంగ్రెస్ నుంచి 89 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత ఉండే వార్డులో సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేయడంతో ఆనేత తలపట్టుకుంటున్నారు.
మిగతా వార్డుల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేశారు. రెబల్స్ నాయకులను పిలించుకుని ముఖ్యనేత బుజ్జిగిస్తున్నారు. అయినా చాలా మంది నాయకులు బరిలో ఉంటామని చెబుతుండటంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా రు. సదాశివపేట మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కోవార్డు లో ఇద్దరి నుం చి ముగ్గురు నాయకులు నామినేషన్ వేశారు. పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే బరిలో ఉండటం ఖాయమని రెబల్ నాయకులు చెబుతున్నారు. అందోల్ మున్సిపాలిటీలో ఒక్కోవార్డు నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు కాంగ్రెస్ నాయకులు బరిలో ఉన్నారు.
రెబల్ నాయకులను బరి నుంచి తప్పించేందుకు ముఖ్యనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. నారాయణఖేడ్‌లో ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి వర్గానికి చెందిన నాయకులు ఎవరికివారే నామినేషన్లు వేశారు. దీంతో ఇద్దరు నాయకులు సగం,సగం చొప్పున వార్డులు పంచుకున్నట్లు తెలుస్తోంది. తాము బీఫామ్ ఇచ్చిన నాయకులను మినహా మిగతా కాంగ్రెస్ నాయకులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ముఖ్యగా ఎంపీ షెట్కార్ సోదరుడు పోటీచేస్తున్న వార్డులో అన్నిపార్టీల వారు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ మున్సిపాలిటీల్లో 37 వార్డులకు 126 మంది నామినేషన్లు వేశారు. పోటీ ఎక్కువ ఉండటంతో టికెట్ల వ్యవహారం గాంధీభవన్‌కు చేరింది.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం మేమే టికెట్లు ఖరారు చేసి నామినేషన్లు నేరుగా ఎన్నికల అధికారికి పంపుతామని చెప్పినట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్ రెబల్స్ బరి నుంచి తప్పుకునేందుకు ఆసక్తిచూపడంలేదు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ రెబల్ నాయకులను బుజ్జగిస్తున్నా ఆయన ప్రయత్నాలు ఫలిండంలేదని తెలుస్త్తోంది. పార్టీ బీఫామ్ ఇవ్వకున్నా పోటీలో ఉంటామని రెబల్ నాయకులు ఖరాఖండిగా చెబుతున్నట్లు సమచారం. దీంతో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో రెబల్స్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.

Ddd