హత్నూర, ఏప్రిల్ 4: ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన వ్యక్తిని దవాఖానకు తీసుకెళ్తే సకాలంలో వైద్యం అందలేదు. దవాఖానకు తరలించాల్సిన అంబులెన్స్ డైవర్ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో క్షతగాత్రుడిని తరలించిన సంఘటన హత్నూరలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. గోవిందరాజ్పల్లికి చెందిన వడ్డె రమేశ్ శుక్రవారం బైక్‌పై వెళ్తుండగా హత్నూర సమీపంలో అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో తీవ్రగాయాలైన రమేశ్‌ను చికిత్స నిమిత్తం హత్నూర ప్రభుత్వ దవాఖానకు స్థానికులు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేయడానికి వైద్యుడు లేకపోవడంతో స్టాఫ్‌నర్సు మెరుగైన చికిత్స కోసం వేరేచోటకు తీసుకెళ్లాలని సూచించింది. దీంతో స్థానికులు దవాఖాన ఆవరణలోని అంబులెన్స్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.
అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో తరలించాల్సి వచ్చింది. దీనిపై వెంటనే జిల్లా వైద్యాధికారికి స్థానికులు ఫోన్ చేయగా, అంబులెన్స్ డ్రైవర్ సొంత పనిమీద వెళ్ల్లాడని, మరునాడు డ్రైవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో సరిగ్గా వైద్యసేవలు అందడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయాలని ప్రజలు కోరారు.