సంగారెడ్డి/మెదక్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పీహెచ్‌సీలతో పాటు మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ దవాఖానలు, సంగారెడ్డిలోని జనరల్ దవాఖానలో డెంగీ కేసులు, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానలకు రోగుల తాకిడీ పెరుగుతున్నది. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో నిత్యం 500 నుంచి 1000 మంది వరకు అవుట్ పేషంట్స్ వస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచే సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద మొదలైంది. దోమల బెడద పెరగడం, పారిశుధ్యలోపం తదితర కారణాలతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. గ్రామాల్లో ఎక్కడవేసిన చెత్త అక్కడనే పేరుకు పోవడంతో పాటు మురుగు కాల్వలు సరిగ్గా శుభ్రం చేయడం లేదు. గ్రామాల్లో చెత్తసేకరించి డంప్‌యార్డుకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీని సమకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని పరిస్థితి నెలకొంది. పారిశుధ్య లోపంతో దోమల బెడద పెరిగింది. పట్టణాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు విషజ్వరాలు బారిన పడుతున్నారు.ఆగస్టులో జిల్లాలో 169 డెంగీ కేసులు నమోదు కాగా, సెప్టెంబర్‌లో 165 కేసులు నమోదయ్యాయి. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసుల నమోదయ్యాయి. ఆగస్టులో 134 టైఫాయిడ్ కేసులు, సెప్టెంబర్‌లో 45, ఈనెలలో ఇప్పటి వరకు 17 మందికి టైఫాయిడ్ సోకింది. జిల్లాలో ఆగస్టులో 275 మంది డయేరియా బారిన పడ్డారు. గతనెల 309 మంది, ఈనెల ఇప్పటి వరకు 108 మందికి డయేరియా సోకి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత రోగులను వేధిస్తున్నది. విషజ్వరాలు సోకిన వారికి చికిత్స అందజేసేందుకు అవసరమైన పలురకాల మందులు ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో లేవు. దీంతో రోగులు ప్రైవేట్‌కు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, డయేరియా, వైరల్ జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆక్టోబర్ 9 వరకు 70 రోజుల్లో జిల్లాలో 9867 కేసులు నమోదయ్యాయి. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 20 డెంగీ కేసులు నమోదు కాగా, 277 డయేరియా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాలోని మెదక్, పొడ్చన్‌పల్లి, సర్ధన తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదు కాగా, రామాయంపేట మండలం ప్రగతిధర్మారం, కొల్చా రం మండలాల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 9 వరకు ఫీవర్ కేసులు 9867, డెంగ్యూ 20,డయేరియా 277, టైఫాయిడ్ 120 కేసులు నమోదయ్యాయి.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డెంగీ, డయేరియా, టైఫాయిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు వేడివేడి ఆహార పదార్ధాలను తీసుకోవాలి. ఇంటి పరసరాలను శుభ్రం గా ఉంచుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సర్కారు దవాఖానల్లో చికిత్స పొందాలి. దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మా సిబ్బంది కృషిచేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుతం విషజ్వరాల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు తక్కువ సంఖ్యలో వస్తున్నాయి. డెంగీ నిర్ధారణ అయితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నాము. సంగారెడ్డి జనరల్ దవాఖానలో విషజ్వరాలు సోకినవారికి చికిత్స అందజేసేందుకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. జ్వరం లేదా విషజ్వరాలు సోకినట్లు కనిపిస్తే రోగులు ప్రభుత్వ దవాఖానకు వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవడంతో పాటు చికిత్స పొందాలని సూచించారు.