సంగారెడ్డి, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) సంస్థ గ్రామాల్లో ఈనెల 14 నుంచి ఉజాల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ రూ.10కే ఎల్ఈడీ బల్బు అందించనుంది. రాష్ట్రంలో ఆరు జిల్లాలను ఎంపిక చేయగా, అందులో సంగారెడ్డి జిల్లా కూడా ఉంది. జిల్లాలోని 11 గ్రామాలు, సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులు అందిస్తారు. ప్రస్తుతం నివాసాల్లో వాడుతున్న 60 వాట్స్, 100వాట్స్ బల్బులను వాపస్ తీసుకుంటారు. వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ బల్బు లు అందిస్తారు. ఎల్ఈడీ బల్బుల వాడకంతో విద్యుత్ పొదుపు జరిగి బిల్లులు తగ్గుతాయని సీఈఎస్ఎల్ సంస్థ తెలిపింది. దీంతో జిల్లాలోని 25,301 వేల నివాసాలకు లబ్ధి చేకూరనున్నది. ముఖ్యంగా గ్రామాల్లో ఇంటింటికీ ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పంచాయతీ పాలకవర్గం, అంగన్వాడీలు చేపడతాయని విద్యు త్‌శాఖ అధికారులు తెలిపారు.
ప్రతి ఇంటికీ 5 ఎల్ఈడీ బల్బులు..
సంగారెడ్డి జిల్లాలోని 22 వేల నివాసాల యజమానులు 5 చొప్పున ఎల్ఈడీ బల్బు లు తీసుకునేందుకు సంస్థ అవకాశం కల్పించింది. కేవలం రూ.10కే ఒక బల్బు చొప్పున ఐదు బల్బులకు రూ.50లు చెల్లించి ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఉజాల పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఎల్ఈడీ బల్బులను వెలిగించి బిల్లులను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్ఈడీ బల్బులు విద్యుత్కాంతి అధికంగా ఉంటుందని, దీంతో వెలు గు సమస్యలు తలెత్తకుండా గ్రామాలు వెలుగుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపులో నిశ్శబ్ద విప్లవానికి తెరలేవనుందని, ఇప్పటికే దేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో ఎల్ఈడీ బల్బులు వెలుగులు పంచుతున్నాయని అధికారులు తెలిపారు. నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో గ్రామ ఉజాల పథకాన్ని ప్రారంభించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎల్ఈడీ వెలుగులు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
సీఈఎస్‌ఎల్‌కు టీఎస్ఎస్పీడీసీఎల్ మద్దతు..
కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ మార్చిలో ప్రారంభించిన గ్రామీణ ఉజాల పథకానికి సీఈఎస్‌ఎల్‌కు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ఎస్పీడీసీఎల్) మద్దతుతో ముందడుగు వేసింది. ఎల్ఈడీ బల్బుల వాడకంతో కరెంట్ ఆదాతోపాటు వినియోగదారులపై భారం పడొదనే నమ్మకంతో తె లంగాణ విద్యుత్‌శాఖ మద్దతు ప్రకటించింది.
మూడు సంవత్సరాల వారెంటీ…
కొత్తగా ఎల్ఈడీ బల్బులను అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ప్రస్తుతం ఇండ్లల్లో వాడుతున్న బల్బులను తీసుకుంటారు. వాటి స్థానంలో కొత్త ఎల్ఈడీ బల్బులను మూడేండ్ల వారంటీతో అందజేస్తారు. 60 వాట్స్, 100 వాట్స్ పాత బల్బులకు సమానంగా ఏడు వాట్స్, 12 వాట్స్ ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు.
జిల్లాలో ఎంపికైన గ్రామాలు…
ఉజాల పథకంలో ఎల్ఈడీ బల్బులు అందుకోనున్న గ్రామాలను సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేశారు. సంగారెడ్డి మండలంలో ఎంపికైన గ్రామాల వారి నివాసాలు ఫసల్‌వాడీ-802, ఇరిగిపల్లి-235, కలబ్గూర్-935, తాళ్లపల్లి-396, కులబ్గూర్-419, నాగాపూర్-267, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్-985, కోత్లాపూర్-330, పోతిరెడ్డిపల్లి, చింతల్‌పల్లి గ్రామాలు సంగారెడ్డి మున్సిపల్లో విలీనమయ్యాయి. కంది మండలంలో చెర్లగూడెం-350, సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ-20,582 నివాసాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పాత బల్బులిచ్చి ఎల్ఈడీ బల్బులు పొందాలి..
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ఉజాల పథకం నేటి నుంచి ప్రారంభించనున్నాం. ఇండ్లల్లో ప్రస్తుతం వాడుతున్న 60 వాట్స్, 100 వాట్స్ మెర్కూరి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు పొందాలి. ఇందుకోసం గ్రామాలకు సీఈఎస్ఎల్ సంస్థ వారు గ్రామ పంచాయతీ దగ్గర ప్రత్యేక వాహనంలో ఎల్ఈడీ బల్బులు అందిస్తారు. వినియోగదారులు తమ ఇండ్లలో వాడుతున్న పాత బల్బులతో పాటు రూ.10 చెల్లించి కొత్త ఎల్ఈడీ బల్బులను తీసుకోవాలి. ఇందుకోసం నేటి నుంచి గ్రామాలకు వచ్చే సీఈఎస్ఎల్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాలి. ఎల్ఈడీ బల్బులు పొంది కరెంట్‌ను ఆదా చేసుకోవాలి.