మద్దూరు(ధూళిమిట్ట), జూలై 11: విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే విద్యార్థుల ఎదుట విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హెచ్ఎంగా పనిచేస్తున్న రవీందర్ సిద్దిపేటలో ట్రైనింగ్‌లో ఉండగా, మరో ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు.
రోజు మాదిరిగానే ఉదయం 9:05 గంటలకు చేర్యాల విష్ణుమూర్తి అనే ఉపాధ్యాయుడు విద్యార్థులచే ప్రార్థన చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సమయం దాటినా ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న కొత్తపల్లి ప్రతాప్, మరో ఉపాధ్యాయుడు ఉపేందర్ స్టాప్రూమ్లో నుంచి బయటకు రాకపోవడంతో విష్ణుమూర్తి మైక్ ఆన్‌చేసి విద్యార్థులచే ప్రార్థ్ధన చేయిస్తున్నాడు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ప్రతాప్, ఉపేందర్ చేత మైక్‌ను ఆఫ్ చేయించి ఇరువురు ప్రార్థ్ధనలో నిలుచున్నారు. ప్రార్థ్ధన అనంతరం ప్రతాప్, విష్ణుమూర్తితో ఇన్చార్జి హెచ్ఎంగా ఉన్న తనకు చెప్పకుండా ప్రార్థ్ధన ఎలా ప్రారంభించావని అడగడంతో పాటు దుర్భాషలాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన విష్ణుమూర్తి ప్రతాప్‌పై దాడి చేశాడు. ప్రతాప్ తిరిగి విష్ణుమూర్తిపై దాడి చేశాడు. ఇరువురు ఉపాధ్యాయులు విద్యార్థుల ముందే కొట్టుకుంటుండగా ఉపేందర్ అనే ఉపాధ్యాయుడు వారిద్దరిని సముదాయించి వెనక్కి పంపించారు. ఈ ఘటనలో ముక్కు దగ్గర గాయమై ప్రతాప్‌కు రక్తస్రావమైంది.
దీంతో వెంటనే అతను స్థానిక పోలీస్ సేష్టన్‌కు వెళ్లి విష్ణుమూర్తిపై ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు చేర్యాల దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ప్రతాప్‌పై విష్ణుమూర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల తీరుపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇన్చార్జి హెచ్ఎం ప్రతాప్‌పై దాడిచేసిన ఉపాధ్యాయుడు విష్ణుమూర్తిని సస్పెండ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆలేటి యాదగిరి మద్దూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.