మిరుదొడ్డి, మే 12: ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్రవ్వ (50), గోప దేవమ్మ (51) ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారిని ఓ కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు.
ఘటన నిరసగా గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో మెదక్-సిద్దిపేట జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
కాగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామి పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ డిమాండ్ చేశారు. ఉపాది హామీ కూలీలకు బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. మృతి చెందిన కూలీల అంత్యక్రియలకు రూ.50 వేలు చొప్పున బాధిత కుటంబాలకు జిల్లా కలెక్టర్ అందించాలని చెప్పారు.