కోహీర్, మార్చి 28: ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్లో చోటుచేసుకొంది. ఎస్సై సతీశ్‌వర్మ వివరాల ప్రకారం… ఒడిశాలోని నబరంగాపూర్ జిల్లా జునపాని గ్రామానికి చెందిన బైద్యనాథ్ భత్ర(26), హరసింగ్ మజ్హి(30) సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్ గ్రామానికి పనుల కోసం వచ్చారు. గ్రామ శివారులోని అక్షర అనంత్ ఫార్మ్‌లో కొద్ది రోజుల నుంచి పనిచేస్తున్నారు.
తాగుడుకు బానిసలుగా మారడంతో వారు పనిచేసే స్థలానికి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు పడ్డారు. ఈనెల 10వ తేదీ నుంచి వారిద్దరూ కనిపించలేదు. దీంతో ఫార్మ్ సూపర్వైజర్ పంకజ్ తివారీ వారు అదృశ్యమైనట్లు 13వ తేదీన కోహీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం రైతులకు బావిలో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జేసీబీ, క్రేన్, కార్మికుల సహాయంతో బావిలో నుంచి ఇద్దరి శవాలను వెలికితీశారు. శవాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.