దుబ్బాక, మే 12: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో దవాఖాన పాలైన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారెడ్డిపేటకు చెందిన బ్యాగరి చంద్రవ్వ (45), గోప దేవవ్వ(48), బైండ్ల లాస్యలతో పాటు మరికొందరు మహిళలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు.
సిద్దిపేట-రామాయంపేట రోడ్డు పోతారెడ్డిపేటలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. దీంతో బ్యాగరి చంద్రవ్వ(45), గోప దేవవ్వ (48) అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ బైండ్ల లాస్యకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను చికిత్స కోసం సిద్దిపేట దవాఖానకు తరలించారు.
బెల్లంపల్లికి చెందిన బాల్మీకి తన నానమ్మతో కలిసి కారులో మెదక్‌లో జరిగే పెండ్లికి వెళ్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా ఎదురుగా వస్తున్న ఉపాధిహామీ కూలీలకు ఢీకొట్టాడు. డ్రైవింగ్ చేస్తున్న బాల్మీకిపై కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం దుబ్బాక సర్కారు దవాఖానకు తరలించినట్లు భూంపల్లి ఎస్సై హరికృష్ణ తెలిపారు.
గుండెపోటుతో మరో కూలీ…
జహీరాబాద్, మే 12: ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో మహిళా కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డి)లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్రోల కమలమ్మ తోటి కూలీలతో కలిసి గ్రామ శివారులో పనులు చేసేందుకు వెళ్లింది.
పనులు చేస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా చాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఉపాధి హామీ ఎఫ్ఏ అనంతరామ్ కూలీల సహాయంతో వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమెకు వైద్యాధికారులు పరీక్షలు చేస్తున్న క్రమంలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న మండల ఉపాధి హామీ ప్రాజెక్టు అధికారి అశోక్‌కుమార్ దవాఖానకు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతిరాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.