నర్సాపూర్: విద్యుత్ షాక్ (Current Shok) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్‌కు రెండు పాడి బర్రెలు ఉన్నాయి. వాటి నుంచి సేకరించిన పాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం బర్రెలను మేపడానికి పొలాలకు తీసుకెళ్లాడు. అప్పటికే లూజ్ అయిన విద్యుత్ తీగలు కిందపడి ఉండడంతో అది గమనించక గేదెలు ఆ వైర్లకు తగులుకొని అక్కడికక్కడే రెండు బర్రెలు చనిపోయాయి.
విద్యుత్ తీగలను సరిచేయాలని గతంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు బర్రెలు మృతి చెందాయని బాధితుడు, గ్రామస్తులు ఆరోపించారు. చనిపోయిన బర్రెల విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు విలపించాడు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు పల్లె రమేశ్ వేడుకున్నాడు.