సిద్దిపేట అర్బన్/నంగునూరు, ఏప్రిల్ 11 : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని జూన్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు.
నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడంపై అధికారులపై మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తెలంగాణకు గుండెకాయ వంటిదని, అన్ని జిల్లాలకు మధ్యలో ఉంటుందన్నారు. రాష్ట్రంలోనే ఏకైక ఆయిల్, రిఫైనరీ ఫ్యాక్టరీ నర్మెట ఫ్యాక్టరీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో పామాయిల్ కొరత చాలా ఉందని, రైతులు ఎంత ఎక్కువ పండిస్తే అంత ఆదాయం పొందవచ్చని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆయిల్‌పామ్ సాగును పెంచాలన్నారు.
మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపారు. అందరు అధికారులు, ప్రజాప్రతినిధుల మాదిరిగానే పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు రాగా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అన్న కారణంతో మంత్రులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అతడిని పోలీసులు నెట్టిపడేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.