సంగారెడ్డి, అక్టోబర్ 3: ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. సదాశివపేట మండలం పెద్దాపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారిపై నిర్మించనున్న సర్కిల్‌కు ఇరు గ్రామాల అన్నదాతలు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని అనుపిస్తున్నది. మార్కెట్ ధరలో ప్రభుత్వం సగం రేటు ప్రకటిస్తేనే భూములు ఇస్తామని బహిరంగంగా వెల్లిడిస్తున్నారు. గురువారం ఆర్డీవో రాజు అధ్యక్షతన జిల్లా పరిషత్ పాత కార్యాలయంలో రెండు గ్రామాల రైతులతో అభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు మార్కెట్లో ఎకరానికి రూ.6కోట్లు పలుకుతున్నాయని, దాంట్లో సగం ధర చెల్లిస్తే ట్రిపులార్‌కు భూములు ఇస్తామని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ముందు ధర ప్రకటిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెద్దాపూర్ గ్రామంలో ఫిల్టర్ బెడ్‌కు 300 ఎకరాల భూమిని ఇచ్చామని, జాతీయ రహదారిలో వ్యవసాయ భూములు కోల్పోయామని, మళ్లీ ట్రిపుల్ ఆర్కు భూములిచ్చి ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు.
అభిప్రాయ సేకరణ అని చెప్పి ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన తర్వాత పట్టాదారు పాసు బుక్కులు, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు జిరాక్సులు ఇవ్వాలని ఆర్డీవో రాజు రైతులను కోరారు. పోలీసుల బందోబస్తులో దౌర్జన్యంగా జిరాక్స్‌లు అడగటం భావ్యంకాదని, తమ అభిప్రాయం లేకుండా భూములు ఎలా తీసుకుంటారని రైతులు అధికారులను నిలదీశారు. మాజీ సర్పంచ్‌లు పట్లోళ్ల వెంకటయ్య, మల్లేశం, కృష్ణ, రమేశ్, గొల్ల శంకర్‌యాదవ్, రాదేశ్యాంరావు, జ యరాజ్, ఇంద్రమ్మ, రాము లు, యాదగిరి, అశోక్, మల్లేశ్వర్, మన్నన్ సిద్దిక్ పాల్గొన్నారు.