నారాయణఖేడ్, మే 12: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక మూలకు విసిరేసినట్టున్న తండా అది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో నాగల్గిద్ద మండలంలో సుమారు 500ల జనాభా ఉన్న గిరిజన ఆవాసం. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడి గ్రామాలతో సమానంగా అభివృద్ధి చెందిన తండా పరిస్థితి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పూర్తిగా తలకిందులైంది. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ శాంతినగర్ తండాను సందర్శించగా, తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడగా, ఇక తండాల పరిస్థితి సరేసరి. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ఒకటైతే, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఇప్పుడు తండాల కథ మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతం తండాల్లో నెలకొన్న పరిస్థితులకు శాంతినగర్ తండా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం తండాలను అక్కున చేర్చుకున్న తీరును, ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య వైఖరిని గిరిజన బిడ్డలు బేరీజు వేసుకుంటున్నారు. సర్కారు తీరు బాగాలేదని, తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఫలితంగా సమస్యలతో సతమతమవుతున్నామని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.
నీటికోసం కర్ణాటకకు..
బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ పథకం నీటితో కర్ణాటకలోని సరిహద్దు గ్రామాల ప్రజ లు తమ దాహార్తిని తీర్చుకోగా ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పది రోజులుగా శాంతినగర్ తండాకు నీరు సరఫరా కావడం లేదు. దీంతో తండావాసులు కర్ణాటకలోని జంగీకి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నిత్యం నీటి సమస్యతో అల్లాడే నారాయణఖేడ్ వంటి ప్రాంతాలకు వరప్రదాయినిగా మారిన మిషన్ భగీరథ పథకం పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇంటి వరకు నీటిని సరఫరా చేయగా, అదేం విచిత్రమో గానీ కాంగ్రెస్ ఏడాదిన్నర కాలంగా సక్రమంగా నీరు సరఫరా కాని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
మరీ ముఖ్యంగా ప్రస్తుత ఎండాకాలంలో నీటి కోసం గిరిజనులు పరుగులు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. కేవలం నిర్వహణ లోపం కారణంగానే తమ తండాకు నీరు సరఫరా కావడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. రోజువారి అవసరాలకు బైక్‌లపై నీటిని తెచ్చుకుంటుండగా, పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలకు రూ.3 నుంచి 4వేల వరకు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటాడుతున్న విద్యుత్ సమస్య
కేసీఆర్ పాలనలో నిరాటంకంగా 24 గంటల విద్యుత్ సరఫరా కాగా, ఇప్పుడు విద్యుత్ సమస్య శాంతినగర్ తండావాసులను వెంటాడుతున్నది. నాలుగు రోజుల క్రితం తండాలోని ట్రాన్స్ఫార్మర్ పాడవగా, అప్పటి నుంచి తండాలో విద్యుత్ సరఫరా లేక అంధకారం అలుముకుంది. తండాలో తరుచూ విద్యుత్ సమస్య తలెత్తడం సర్వసాధారణంగా మారిందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రత్యేకాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ తండావాసులంతా కలిసి డబ్బులు పోగేసి మరమ్మతులు చేసుకోవాలని చెబుతున్నారని గిరిజనలు వాపోయారు. తండాలో ఒక బోరుమోటరు ఉన్నప్పటికీ విద్యుత్ సమస్య కారణంగా సదరు బోరుమోటరు వినియోగానికి నోచుకోవడం లేదు.
రోడ్డు పరిస్థితి అధ్వానం
కేసీఆర్ ప్రభుత్వంలో వేసిన రోడ్డు ప్రస్తుతం కంకర తేలి వాహనాలు వెళ్లలేని స్థితికి చేరింది. సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సదరు రోడ్డు మరమ్మతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అంతలోనే ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రోడ్డు నిర్వహణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా రోడ్డును బాగు చేయిస్తుందేమోనని తండావాసులు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఫలితంగా తరుచూ వాహనాలు ప్రమాదానికి గురై తండావాసులు గాయాల పాలవుతున్నారు. సత్వరమే రోడ్డు పనులు చేపట్టాలని తండావాసులు కోరుతున్నారు.
మమ్మల్ని పట్టించుకోవట్లేదు..
మేము ప్రతిరోజూ ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏ సమస్య లేదు. కరెంటు సరిగ్గా ఉండే, నీళ్లు మంచిగనే వచ్చినయి. మార్పు మార్పు అని అందరితోని ఓట్లు ఏయించుకొని గెలిచిండ్లు కానీ ఏం డెవలప్మెంట్ చేస్తలేరు. పది రోజుల నుంచి నీళ్లు అస్తలేవు, నాలుగు రోజుల నుంచి కరెంటు లేదు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మాకు చాలా కష్టం అయితుంది. మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నం.
– ప్రబిత, శాంతినగర్ తండా
కేసీఆర్ గవర్నమెంటే బాగుండే
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు బాగుండే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక మాకు చాలా తిప్పలు అయితుంది. కేసీఆర్ గవర్నమెంట్ల ఒక్కరోజు కూడా నీళ్ల కష్టం రాలే. రోజూ ఇంటి ముంగటి దాక నీళ్లస్తుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అచ్చిన యాడాదిన్నర సంది అప్పుడు నీళ్లు అస్తలేవు. కరెంట్ సక్కగ ఉండది. తండోళ్లమంతా కలిసి పైసలేసుకొని ట్యాంకర్ తెప్పిచ్చుకొని ఎల్లదీస్తున్నం. ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయి 4 రోజులైనా చేపిస్తలేరు. ఇది మంచిది కాదు. పేదోళ్ల గోస పోసుకుంటుండ్రు. -సువాలిబాయి, శాంతినగర్ తండా
కొడుకు పెండ్లికి నీళ్లు కొంటున్నా..
కొడుకు పెండ్లి ఉంది సారు. తండాల నీళ్లు అస్తలేవు.. ఇంటి నిండా చుట్టాలు వచ్చిండ్రు. చేతులు కడుక్కోనికి నీళ్లు లేవు. రూ.3 వేలు ఇచ్చి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకుచ్చిన. నీళ్లు రాక పది రోజులాయే. కరెంట్ లేక నాలుగు రోజులాయే. ఈ కాలంలో అందరికీ అవసరమైన నీళ్లు, కరెంట్ లేకపోతే ఎట్లా బతకాలే. ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ సర్కార్ల నీళ్లు మంచిగ వచ్చినయి. ఇప్పుడు ఏమైందో ఏమో సరిగ్గ ఇడుస్తలేరు. దయచేసి నీళ్లు, కరెంటు ఇయ్యాలని కోరుతున్నా.
– మారుతినాయక్, శాంతినగర్ తండా
కర్ణాటక ఊళ్లకేని నీళ్లు తేవాలే
తండాకు నీళ్లు రాక పది రోజులు అయింది. మా పొట్ట కోసం పనిచేసుడు ఏమో కాని రోజంతా నీళ్ల కోసం ఉరుకుడే ఉన్నది. కర్ణాటక బార్డర్ ఊరు జమ్గికి ఐదు కిలోమీటర్లు పోయి బైక్‌ల మీద నీళ్లు తెస్తున్నం. తండాల బైక్‌లు ఉన్నోల్లమం తా బైక్‌లకు బిందెలు కట్టుకుని నీళ్లు మోస్తున్నం. మా తండాకు రోడ్డు కూడా బాగాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ల వేసిన రోడ్డే ఉన్నది. ఈ గవర్నమెంట్ రోడ్డు మంచిగ చేయాలే గదా.. చేస్తలేదు. తండాల సమస్యలు తీర్చి మాకు తిప్పలు లేకుండా చేయాలని కోరుతున్నా.
– శివాజీనాయక్, శాంతినగర్ తండా