అక్కన్నపేట, ఫిబ్రవరి 22: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్చెర్వుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు వెళ్లేందుకు మట్టిరోడ్డు కూడా సరిగ్గా లేదు. దీంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. తండాకు తారు రోడ్డు వేయాలని ఇటీవల ఆ తండావాసులు నిరసన వ్యక్తం చేశారు. తండాలో మురుగు కాల్వలు లేక ఇండ్ల ముందు నుంచే మురుగు పారుతున్నది. ఎక్కడిక్కడ పారిశుధ్యం పేరుకుపోగా ఇబ్బందులకు గురవుతున్నారు. తండాలో ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగితే వారు ట్రాక్టర్ల ద్వారా తాత్కాలికంగా మట్టి వేసుకొని చదును చేసుకుంటున్నారు.
రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండాలో ఎవరికైనా పాముకాటు వేసినా, ఇతర అత్యవసర సమయాల్లో 108కు ఫోన్ చేస్తే తండాకు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యధిక గిరిజన తండాలు ఉన్న అక్కన్నపేట మండలంపై దృష్టిసారించి, తమ తండాలో ప్రధానంగా రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, వీధి దీపాలు, ఇతరత్రా మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని దుబ్బ తండా గిరిజనులు కోరుతున్నారు.
తండాకు అంబులెన్స్ వస్తే బతికేటోడు..
ఇటీవల తండాకు చెందిన భానోతు బాలునాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు, తండావాసులం 108కు ఫోన్ చేశాం. మల్చెర్వుతండా వరకు వచ్చిన అంబులెన్స్ రోడ్డు సరిగా లేదని దుబ్బతండాకు రాలేదు. గంట వరకు వేచి ఉండి, చివరికి బైక్పై తీసుకెళ్లి మల్చెర్వుతండాలో ఉన్న అంబులెన్స్ ఎక్కించాం. దవాఖానకు వెళ్లిన తరువాత బాలునాయక్ చనిపోయాడు. అదే అంబులెన్స్ తండాకు వచ్చి ఉండేలా రోడ్డు ఉంటే ఇయ్యాల బాలునాయక్ బతికి ఉండేవాడు. కనీసం తండాలో ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా రాదు.
-గుగులోతు మహేందర్, దుబ్బతండా వాసి
రోడ్డు వస్త్తదో లేదో…
దుబ్బతండాకు డాంబర్ రోడ్డు సచ్చిపోయే వరకు అయినా వస్త్తదో లేదో. రెండేండ్ల కింద రోడ్డు వేస్తామని వచ్చి చూసిపోయిండ్రు. అంతలా ఎలక్షన్లు వచ్చినై. ఇగ రోడ్డు లేదు ఏం లేదు. వాన పడితే మా తండా నుంచి మల్చెర్వుతండాకు పోవడం నరకంగా ఉంటది. బురద, జారుడు, నడిచిపోవడానికీ తిప్పలే. తండాల ఫంక్షన్లు చేసుకుంటే వచ్చిన సుట్టపోళ్లు రోడ్డు లేకపాయే అని ఇజ్జత్ తీస్తున్నరు. ఇప్పుడు ఉన్న గీ మంత్రి పొన్నం ప్రభాకర్ మా దుబ్బతండా దిక్కు చూసి రోడ్డు వేయాలని మా తండోళ్ల అందరి తరపున మొక్కుతున్న.
– బానోతు చిలుకమ్మ, దుబ్బతండా