నారాయణఖేడ్, మార్చి 3: కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీళ్లు మంచిగ వస్తుండే.. కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చినప్పటి సంది నీళ్లే అస్తలేవు సారు.. అని గిరిజన మహిళలు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం భూపాల్‌రెడ్డి కంగ్టి మండలంలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో గాజులపాడ్ టోపా తండాలో మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో గుమిగూడి ఓ ప్రైవేట్ బోరు వద్ద నీళ్లు పట్టుకుంటున్నారు.
గిరిజన మహిళలను చూసి భూపాల్‌రెడ్డి పలకరించగా, మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో ఇంటింటికీ నల్లా ఉంది కదా అని భూపాల్‌రెడ్డి అడగగా, నల్లాలు ఉన్నా ఈ గవర్నమెంట్ నీళ్లు సైప్లె చేస్తలేదు సార్ అని అన్నారు. ప్రైవేట్ బోరు ఉన్న వారిని బతిమాలుకుని నీళ్లు నింపుకొంటున్నమని, కేసీఆర్ సీఎం ఉండంగా మాకు ఏ తిప్పలు లేకుండే, ఇప్పుడు రోజంతా నీళ్ల కోసం తండ్లాడుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుబంధు, రుణమాఫీ, మహిళలకు రూ. 2500ల పథకాల గురించి మాజీ ఎమ్మెల్యే ఆరా తీయగా, ‘ఏ పథకం లేదు.. అన్ని జూటా మాటలే’ అని మహిళలు నిష్టురమాడారు. గిరిజనుల మంచినీటి కష్టాలు చూసి చలించిపోయిన భూపాల్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి మిషన్ భగీరథ నీరు అందే విధంగా చూడాలని కోరారు.