మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 18: కన్నతల్లిలా ఓ పాపను సంకనెత్తుకొని, మరో పాపను వేలు పట్టుకొని బడిబాట పట్టిన ఈ బంజారా బాలిక పేరు అజ్మీరా సంధ్యారాణి. ఈమె తాను చదువుకోవడమే కాకుండా మరో ఇద్దరు పిల్లలకు విద్యనందించే చదువుల తల్లిగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాబ్లానాయక్ తండాకు చెందిన అజ్మీరా స్వరూప-మంక్త్యా దంపతుల చిన్న కూతురు సంధ్యారాణి. తండ్రి మూడేండ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయిండు.
ఇద్దరు కూతుళ్ల వివాహాలను జరిపించిన స్వరూప మూడో కూతురు ఇంటర్ చదివి పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేసింది. చిన్న కూతురు సంధ్యారాణిని కూడా బడి మాన్పించేందుకు ప్రయత్నించిన ఆమె పట్టుదలను చూసి చదివించేందుకు తల్లి ఒప్పుకుంది. సంధ్యారాణి బడికి వెళ్లేందుకు ప్రతిరోజు పడుతున్న బాధలు అంతా ఇంతకాదు. ప్రతి రోజు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండాపూర్‌లో హైస్కూల్‌కు వెళ్తుంది. తాను ఒక్కతే వెళ్లకుండా తండాలోని ఒకటి, రెండో తరగతులు చదువుతున్న అజ్మీరా హర్షిత, అజ్మీరా శ్రీనిధి అనే చిన్నారులను తన వెంటపెట్టుకొని బడికి వెళ్తున్నది. కొన్నిసార్లు నడవలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులను సంధ్యారాణి చంకనెత్తుకొని బడికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
సంధ్యారాణి బడికి వెళ్లలేకపోతే చిన్నారులు కూడా బడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు పిల్లలు నడవలేక అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్) సిస్టం వల్ల బడికి ఆలస్యంగా వెళ్తే ఈ ముగ్గురు విద్యార్థులకు గైర్హాజరు పడుతుంది. ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా అందించే మధ్యాహ్న భోజనం కూడా అందని పరిస్థితి నెలకొంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో పనులకు వెళ్లే ఈ ముగ్గురు బాలికల తల్లిదండ్రులు ప్రతి రోజు వీరిని బడి వద్ద దింపలేని పరిస్థితి ఉంది.
దీంతో చేసేదేమీలేక చదువుకోవాలనే పట్టుదలతో సంధ్యారాణి కాలినడకన అధ్వానంగా ఉన్న పిల్లబాటలో చిన్నారులను వెంటబెట్టుకొని ప్రతి రోజు రానుపోను ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్తున్నది. ఇక అజ్మీరా, హర్షిత పరిస్థితులు మరోరకంగా ఉన్నాయి. సంధ్యారాణి పదో తరగతి కావడంతో ఉదయం ఒక గంట ముందు, సాయంత్రం మరో గంట వెనుక ప్రత్యేక తరగతుల కోసం ఉంటే ఆమెతో పాటే రాత్రి వరకు చిన్నారులు కూడా ప్రతి రోజు ఉంటున్నారు. కొన్నిసార్లు విద్యార్థులు పడుతున్న బాధలు చూసి చలించిన పాఠశాల ఉపాధ్యాయుడు రవికుమార్ తన బైక్‌పై పిల్లలను తండాలో దింపిన రోజులు ఉన్నాయి.
ప్రభుత్వం, దాతలు సహకారం అందించాలి..
బడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక నేను, నాతో పాటు చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు నడవలేకపోతున్నారు. బడికి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్కూల్ వ్యాన్ ఏర్పాటు చేయాలి. లేకపోతే నాకు సైకిల్ అందిస్తే రోజూ పిల్లలను తీసుకొని బడికి పోతా. అమ్మ బడి బంద్ చేయాలని చెప్పినా బలవంతంగా నేనుబడికి వెళ్తున్న. ప్రభుత్వం, దాతలు నా చదువుకు సహకరిస్తే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తా. మా ముగ్గురి చదువు ముందుకు సాగేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నా.
– అజ్మీరా సంధ్యారాణి