చౌటకూర్, నవంబర్ 16: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు ఏడు నెలలుగా వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ, పనిచేస్తున్న చోటనే నివాసముంటూ విద్యాబోధన చేస్తున్న వారికి సరైన గుర్తింపు కరుమైంది. సంగారెడ్డి జిల్లాలోని హత్నూరలో బాలికలు, నారాయణఖేడ్‌లో బాలికలు, బాలుర, చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో వెయ్యి మంది వరకు విద్యార్థులు చదువుతుండగా, 34 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 339 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు.
వీరికి ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. విద్యార్థినీవిద్యార్థులకు రాత్రింబవళ్లు శ్రమించి విద్యా బోధన చేస్తున్నప్పటికీ తమ సేవలకు గుర్తింపు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగ్గ ప్రయోజనం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పూర్తి స్థాయిలో తగిన విద్యార్హతలతో ఎంఏ, బీఈడీ, టెట్ పోటీ పరీక్ష రాసి ఉత్తీర్ణులవుతున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు తక్కువ కాకుండా వివిధ రకాల పోటీ పరీక్షలు రాసి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా ఎంపికయ్యారు.
మారుమూల గిరిజన తండాల్లో రోడ్డు మార్గం లేని ప్రాంతాల్లో విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.45 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు జిల్లా స్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించేలా వారిని తయారు చేస్తున్నారు. సమాయానికి వేతనాల్లేక కుటుంబాల పోషణ కష్టతరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మారెడ్డిగూడెంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో 8 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు.
రాత్రింబవళ్లు పనిచేస్తున్నప్పటికీ నెలకు కేవలం రూ.12 వేల చొప్పున వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. అరకొర వేతనాన్ని కూడా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తున్నారు. అందులోనూ కోతలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఆవేదనకు గురవుతున్నారు. అన్నీ అర్హతలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రోస్టర్ విధానంలో ఎంపికైన వారికి గురుకుల పాఠశాల విధానం ద్వారా వేతనాన్ని రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తూ నిరుపేద గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తమకు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.