కొమురవెల్లి, సెప్టెంబర్ 29 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో అమ్మాయి(10)పై అదే గ్రామానికి చెందిన ఎండీ షార్బోద్దీన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం సాయంత్రం ఇంట్లో తన ఇద్దరు చెల్లెల్లతో ఆడుకుంటున్న సమయంలో పక్క ఇంట్లో ఉండే ట్రాక్టర్ డ్రైవర్ ఎండీ షార్బోద్దీన్(20) ఇంట్లోకి ప్రవేశించి తలుపులు మూసివేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.జరిగిన విషయం చెప్పవద్దని బాలికను బెదిరించాడు.
దీంతో బయపడిన బాలిక ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. శనివారం పాఠశాలకు వెళ్ల్లొచ్చిన బాలిక ఆలసటతో ఉండటంతో రాత్రి కుటుంబసభ్యులు ఏమైందని అడగడంతో సెకిల్పై నుంచి పడినట్లు చెప్పింది.అదే సమయంలో జరిగిన సంఘటన గురించి బాలిక చెల్లెల్లు తల్లిదండ్రులకు తెలుపడంతో వారు 100కు ఫోన్ చేయడంతో రాత్రి చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజుతో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు.
అప్పటికే అక్కడ పహారా కాస్తున్న పోలీసులు కళ్లు గప్పి ఒక్కసారిగా నిందితుడి ఇంటికి నిప్పు అంటించి వాహనాలను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. నిందితుడి ఇంటి వద్ద ఉన్న పలు వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా డీసీపీ(అడ్మిన్) మల్లారెడ్డి గ్రామాన్ని సందర్శించి పోలీసులకు పలు సూచనలు చేశారు.
బాలికపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధకు ఫోన్‌చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని,నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు భారీగా తరలివచ్చి గ్రామంలో ఆందోళన నిర్వహించారు.