మెదక్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు తోడు ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాలతో బాధపడుతూ చేరుతున్న బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలవొప్పితో బాధపడుతున్నారు. మరికొందరు తీవ్ర జ్వరం, కపంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానల్లో ఇన్ పేషెంట్‌గా చేరి రోజుల తరబడి చికిత్స పొందుతున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పేరుకపోయిన చెత్తను, పిచ్చిమొకలు, నీటి నిల్వలపై దృష్టి సారించకపోవడంతో జిల్లాలో దోమలు విపరీతంగా పెరిగాయి. మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి దోమలు పెరగడమే కారణమని వైద్యులు చెడుతున్నారు.
విషజ్వరాలు అత్యధికంగా మారుమూల గ్రామాలు, తండాలు, మురుగు వాడల్లో సోకుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎకువగా పేద మధ్య తరగతి ప్రజలే ఉండడంతో ఆర్థిక స్థోమత లేక వైద్యం కోసం స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర దవాఖానకు తరలుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో రోగుల తాకిడి పెరిగి బెడ్లను సర్దుబాటు చేయలేక ఇబ్బందులు ఎదురొంటున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రైవేట్ దవాఖానలు సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రస్తుతం మెదక్ జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎకువగా నమోదవుతున్నాయి. అధికారిక లెకల ప్రకారం డెంగీ కేసులు 20 నమోదైనట్లు అధికారులు తెలిపారు. కానీ, ప్రైవేట్ దవాఖానల్లో వందకు డెంగీతో బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. మెదక్ జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలు, 493 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
వీటిలో దోమల నివారణకు అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటుండడంతో దోమల సంతతి పెరిగిపోయి దోమకాటు బాధితులు ఎకువవుతున్నారు. మున్సిపాలిటీల్లో కేవలం ఒకరిద్దరిని మాత్రమే దోమల నివారణ మందులు కొట్టేందుకు ఉపయోగిస్తుండడం, ఇక గ్రామాల్లో నైతే వారానికి ఒకసారి మాత్రమే మందుల పిచికారీ చేపడుతున్నారని తెలిసింది. దోమల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి చర్యలు చేపట్టాలని ప్రజల కోరుతున్నారు. మెదక్ జిల్లాలో 19 పీహెచ్‌సీలు, ఒక అర్బన్ పీహెచ్‌సీలు, 2బస్తీ దవాఖానలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 18 డెంగీ కేసులు నమోదు కాగా, జూన్, జూలై, ఆగస్టు నెలలో 15158 వైరల్ ఫీవర్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. ఒక్క మలేరియా కేసు నమోదు కాలేదు. డెంగీ కేసులు ఎక్కువగా రామాయంపేట పట్టణంతో పాటు మండలాల్లో నమోదవుతున్నాయి. 2023లో డెంగ్యూ కేసులు 31 నమోదయ్యాయి. 2024లో 28 కేసులు, 2025లో 18 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 2023లో 3, 2024 నుంచి 2025 వరకు ఒక్క కేసు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డెంగీ, మలేరియా, టై ఫాయిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అలసట అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రభు త్వ దవాఖానల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ శ్రీరాం, డీఎంహెచ్‌వో మెదక్