మద్దూరు(ధూళిమిట్ట), మే 16: విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల అకింతభావంతో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహను చెరిపేస్తున్నది. ధూళిమిట్ట హైస్కూల్ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రతిభ చాటడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ధూళిమిట్ట హై స్కూల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరం భం నుంచే ప్రత్యేక బోధన కొనసాగిస్తున్నారు. రెగ్యులర్‌గా క్లాస్‌లతో పాటు ప్రతిరోజు స్లిప్ టెస్ట్‌లు నిర్వహించి, విద్యార్థుల సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు పరీక్షిస్తున్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ఉదయం గంట, సాయంత్రం గంట విద్యార్థులకు స్పెషల్ క్లాస్‌లు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఐఎఫ్‌పీ డిజిటల్ బోర్డు ల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేస్తున్నారు. ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఉదయం వేళలో నేరుగా ఫోన్ చేసి పిల్లలను నిద్ర నుంచి లేపుతున్నారు. పిల్లలు చదువుతున్నది లేనిది ఉపాధ్యాయులు తెలుసుకుంటారు. విద్యార్థుల సామర్థ్ధ్యాన్ని బట్టి వేర్వేరుగా తరగతులు నిర్వహించి, వెనకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రతినెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, విద్యార్థుల బలం, బలహీనతలపై వివరిస్తున్నారు. పరీక్షలు జరిగే సమయంలో సబ్జెక్ట్ టీచర్‌తో పాటు హెచ్ఎం విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఫలితంగా ఉత్తమ రిజల్ట్స్ సాధ్యమవుతున్నాయి.
వినూత్న ప్రయోగాలకు వేదిక
ఇటీవలి కాలంలో ధూళిమిట్ట హైస్కూల్ వినూత్న ప్రయోగాలకు వేదికగా మారింది. రాష్ట్రంలోనే తొలిసారిగా పాఠశాలకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి, పాఠశాల సమగ్ర సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేశా రు. పాఠశాల విద్యార్థులను నాలుగు హౌసెస్‌గా విభజించి వారికి ప్రత్యేక డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నారు. హౌసెస్‌కు కొంతమంది విద్యార్థులను బాధ్యులుగా చేసి వివిధ కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. క్యూఆర్ కోడ్‌తో హాల్‌టికెట్లను తయారు చేశారు. పరీక్ష ఫలితాలు ఆన్లైన్లో పొందుపర్చి, పలు పాఠశాలలకు ఆదర్శంగా నిలిచా రు. పాఠశాలలో మాక్ ఓటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్తాచాటింది. ప్రైవేట్, కార్పొరేట్‌ను తలదన్నేలా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు 210మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది 42మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా, 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఐదుగురు విద్యార్థులు 550పైన మార్కులు సాధించారు. పాఠశాల విద్యార్థిని తుజాలపురం రమ్య 571 మార్కులతో హుస్నాబాద్ డివిజన్ టాపర్‌గా నిలిచింది. డివిజన్ పరిధిలోని 40 పాఠశాలల్లో ధూళిమిట్ట విద్యార్థి మాత్రమే టాపర్‌గా నిలిచారు. విద్యార్థిని బత్తిని వర్షిణి 569, తుజాలపురం రక్షిత 568, రచ్చ రిషిత 557, కొలిపాక రక్షిత 553 మార్కులు సాధించారు. మరో 15మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించి ఔరా అనిపించారు. 2023 నుంచి ధూళిమిట్ట పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుండడం విశేషం. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి చేతుల మీదుగా సన్మానం పొందారు.
విద్యార్థులకు అభినందనలు మా ధూళిమిట్ట పాఠశాల 1967లో ఉన్నత
పాఠశాలగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి మారుమూల గ్రామమైనప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించుకుంటూ ప్రత్యేక గుర్తింపును పొం దాం. ఒకప్పుడు చుట్టూ వాగు ఉండి రాకపోకలకు సౌకర్యాలు లేకపోయినా స్థానిక ఉపాధ్యాయులు విశేషమైన కృషితో మంచి ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపును ఆనాడు పొందింది. ఇక్కడ పదో తరగతి చదివిన విద్యార్థులు ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లారు. పాఠశాల విద్యార్థులు దేశ విదేశాలల్లో ఉద్యోగాలు వివిధ రంగాల్లో రాణిస్తూ గ్రామానికి ఎంతో పేరును తెచ్చారు. అదే పరంపరను ఇప్పటి విద్యార్థులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నేను కూడా ఈ పాఠశాలలో 37 ఏండ్లు ఉపాధ్యాయునిగా పనిచేశాను. భవిష్యత్‌లో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
– తిగుళ్ల సుధాకరశర్మ, విశ్రాంత ఉపాధ్యాయులు, ధూళిమిట్ట (సిద్దిపేట జిల్లా)
ఆధునిక పద్ధ్దతులతో బోధిస్తున్నారు..
మా స్కూల్లో ప్రతి కార్యక్రమం ఘనంగా జరుపుకొంటాం. మాసార్లు మాకు అత్యాధునిక విద్యతో పాటు వసతులు కల్పిస్తున్నారు. పాఠశాలలో ప్రతి రోజును ఒక ఉత్సవంగా జరుపుకొంటున్నాం. కొత్తగా ఓటింగ్ సిస్టంను నిర్వహించారు. హౌసెస్‌ను ఏర్పాటు చేసి హౌస్‌ల ద్వారా వివిధ రకాల ఆటలు ఆడిపిస్తున్నారు. డిజిటల్ సౌకర్యంతో ఆధునిక విద్య అందిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం మాకు గర్వంగా ఉంది. మా స్కూల్ నుంచి విద్యార్థులకు చదువు, విజ్ఞానంతో పాటు ఆటలు నేర్పిస్తున్నారు.
– వేణుగోపాల్, తొమ్మిదో తరగతి విద్యార్థి
సార్లు పాఠాలు చక్కగా చెబుతున్నారు..
మా స్కూల్లో సార్లు చక్కగా పాఠాలు చెబుతున్నారు. చదువుతో పాటు క్రీడల్లో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాం. డిజిటల్ విధానంలో మాకు సార్లు పాఠాలు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాస్‌లు తీసుకుంటున్నారు. ఎన్ఎమ్ఎమ్ఎస్ స్కాలర్‌షిప్‌లకు మా పాఠశాల నుంచి చాలా మంది ఎంపికయ్యారు. ప్రైవేటు బడుల కంటే మా పాఠశాలలోనే సౌకర్యాలు ఉన్నాయి.
– సుమెర, పదో తరగతి విద్యార్థిని
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతాం..
నేను 2023లో హెచ్ఎంగా జాయిన్ అయ్యాను. అప్పుడు పాఠశాలలో 140 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అన్ని సబ్జెక్ట్‌లకు పాఠశాలలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయులంతా కలిసికట్టుగా అంకితభావంతో పనిచేస్తుండడంతో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రణాళికను రూపొందించి, దానికి అనుగుణంగా ఏడాది పొడవునా పనిచేస్తున్నాం. విద్యార్థుల సామార్థ్యాన్ని గుర్తించేందుకు వివిధ రకాల పరీక్షలు పెడుతున్నాం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. స్కూల్ అభివృద్ధికి డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తుల సహకారం మరువలేనిది. పాఠశాలలో వినూత్న ప్రయోగాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్‌లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతాం. -కరుణాకర్‌రెడ్డి, గెజిటెడ్ హెచ్ఎం,
ధూళిమిట్ట హైస్కూల్ (సిద్దిపేట జిల్లా)
గర్వంగా ఉంది..
మా ధూళిమిట్ట హైస్కూల్ ప్రైవేటు పాఠశాల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. పాఠశాలలో ఏటా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. మూడేండ్లుగా వంద శాతం ఫలితాలు రావ డం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల ఫలితాలను చూస్తే ధూళిమిట్టకు పూర్వ వైభవం వచ్చింది అనిపిస్తుంది. పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు గ్రామస్తులమంతా సహకరిస్తాం.
– రావుల అజయ్, గ్రామస్తుడు, ధూళిమిట్ట (సిద్దిపేట జిల్లా)