చేర్యాల, జనవరి 5 : కోరికలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి ఆలయ పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది. కల్యాణోత్సవానికి 30వేల మందికి పైగా భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు హాజరుకానున్నారు. స్వామివారి క్షేత్రంలోని సీసీరోడ్లను శుభ్రం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోటబావి వద్ద నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక, ఆలయ సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 7న జరిగే మల్లన్న కల్యాణోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు హాజరుకానున్నారు.స్వామి వారి క్షేత్రంలోని సీసీ రోడ్లను శుభ్రం చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోటబావి వద్ద నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక, ఆలయ సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్ల పై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు స్వామి వారి కల్యాణోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
కల్యాణోత్సవానికి 30 వేల మంది భక్తులు
స్వామి వారి కల్యాణోత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరయే అవకాశం ఉన్నందున మల్లన్న ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వశాఖ అధికారులు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానులు, పచ్చదనం ఉట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలయానికి వచ్చిన భక్తులు దేవుని సన్నిధిలో సేదతీరేందుకు గంగరేగుచెట్టు, కల్యాణ వేదిక, ప్రసాదాల విక్రయశాల వద్ద చలువు పందిళ్లు తదితర వసతులు ఏర్పాటు చేశారు.స్వామి వారి కల్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మిషన్ భగీరథపధకంలో భాగంగా సరఫరా అవుతున్న గోదావరి నీటిని నల్లాల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్వామి వారి క్షేత్రంలో (గోదావరి జలాలు) తాగు నీటిగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు ఆలయవర్గాలకు చెందిన 18 బోర్లు, 15 నీటి ట్యాంకులు, 300 కుళాయిలు సిద్ధం చేశారు.స్వామి వారి క్షేత్రంలో 3 సులబ్ కాంప్లెక్స్‌లు, బస్ స్టేషన్ వద్ద తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు భక్తుల స్నానాల కోసం 200 షవర్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు షవర్స్ పక్కనే మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులు కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.రాజీవ్ రహదారిలోని మల్లన్న స్వాగత తోరణాల వద్ద అన్ని ఆర్టీసీ డిపోల బస్సులు నిలుపాలని ఆలయవర్గాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా లేఖలను పంపించారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు ఇబ్బందులు తలెత్తకుండా మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
‘మల్లన్న’ ప్రత్యేక పూజల సామగ్రి సిద్ధం
ఈ నెల 7వ తేదీన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యే క పూజల వెండి తదితర సామగ్రిని ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే స్వర్ణ కిరీటం, కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం తదితర వెండి, పంచలోహ సామాగ్రికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయవర్గాలు సిద్ధం చేశాయి.స్వామి వారి కల్యాణోత్సవం మొదలుకొని ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన తదితర పూజలకు సదరు సామగ్రి కీలకం కావడంతో ప్రతి ఏటా ఆలయవర్గాలు స్వామి వారి కల్యాణోత్సవం ముందు రోజుల్లో వాటిని శుభ్రం చేసి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
కల్యాణ మహోత్సవానికి భారీ బందోబస్తు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ నెల 2న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మల్లన్న క్షేత్రంలో పర్యటించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు, దేవాదాయ, విద్యు త్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి సూచించిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషన్ డీసీపీ శుక్రవారం ఆయన మల్లన్న క్షేత్రంలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం శీఘ్రదర్శనం, స్పెషల్ దర్శనం, సాధారణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ, కల్యాణ కట్ట, వీఐపీ గ్యాలరీ, జనరల్ గ్యాలరీ తదితర వాటిని పరిశీలించారు.
కల్యాణం పూర్తి అయిన తర్వాత భక్తులు స్వామి వారి వద్దకు వచ్చి అక్షింతలు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏర్పాట్లు చేయించారు. వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుం డా ఏర్పాట్లు చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. క్షేత్రంలో ప్రత్యేకంగా సీసీ కెమోరాలు ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ గురించి వీహెచ్ఎఫ్ సెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయనతో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, కొమురవెల్లి ఎస్సై నాగరాజు, మద్దూరు ఎస్సై యూనిస్ హైమద్ అలీ, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘మల్లన్న’ కల్యాణ వేద పర్యవేక్షణకు ఉజ్జయిని పీఠాధిపతి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ వేద పర్యవేక్షణకు మధ్యప్రదేశ్ ఉజ్జయని పీఠాధిపతి సిద్ధ లింగరాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామీజీ మల్లన్న క్షేత్రానికి రానున్నారు. స్వామిజీ ఈ నెల 6వ తేదీన రాత్రి పొద్దుపోయిన తర్వాత కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి చేరుకొనున్నారు.ఆదివారం వేకువజామున ఆలయవర్గాలు నిర్వహించే దృష్టికుంభాల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొనడంతో పాటు శ్రీ మల్లికార్జున స్వామి వారి తొలి దర్శనాన్ని చేసుకోనున్నారు.అనంతరం ఉదయం 10.45 గంటలకు ప్రారంభమై కల్యాణోత్సవాన్ని పర్యవేక్షించనున్నారు.
కల్యాణం వైభవంగా నిర్వహిస్తాం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.స్వామి వారి కల్యాణోత్సవానికి 30వేలకు పైగా భక్తులు హాజరుకానున్నారు.స్వామి వారి కల్యాణోత్సవం కాగానే భక్తులు అక్షింతలు వేసి స్వామి వారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు. స్వామి వారి కల్యాణోత్సవానికి అన్నివర్గాలకు చెందిన భక్తులు హాజరుకావాలి.
– ఎ.బాలాజీ,ఆలయ ఈవో