హుస్నాబాద్, మే 8: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మహాసముద్రం సమైక్య పాలనలో నిరాదరణకు గురై నిర్మాణానికి నోచుకోలేదు. చుట్టూ గుట్టలు మధ్యలో సముద్రంలాగా నీరు ఉండే ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు మహాసముద్రం అని పిలిచేవారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దీనికి గండిపడింది. గండిని పూడ్చాలని మూడు దశాబ్దాలుగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు అప్పటి ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాసముద్రం ప్రత్యేకతను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆగస్టు 8, 2015న స్వయంగా గండి ప్రాంతాన్ని సందర్శించారు.
అక్కడే సహపంక్తి భోజనాలు కూడా చేశారు. మహాసముద్రం శిఖంలో జరిగిన బహిరంగసభలో గండిని పూడ్చేందుకు రూ.3.75కోట్ల నిధులు మంజూరు చేశారు. నవంబర్ 8, 2016న మంత్రి హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన చేయగా రెండున్నరేండ్లలో పూర్తయి మినీ రిజర్వాయర్‌గా రూపాంతరం చెందింది. ఇందులోని నీటి వల్ల చుట్టుపక్కల ఉన్న 20గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఆహ్లాదకరమైన ప్రాంతం కావడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.