సిద్దిపేట, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోదాం పదా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు… అంటూ జనం జనజాతరకు సిద్ధ్దమయ్యారు. కేసీఆర్ సార్‌ను చూసి, ఆయన మాటలు విని రావాలని ఊరూవాడ నుంచి ప్రజలు రజతోత్సవ సభకు కదులుతున్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యు లు వాహనాలను సమకూర్చారు.
రజతోత్సవ సభకు వివిధ రూపాల్లో వెళ్ల్లనున్నారు. కొంతమంది రైతులు ట్రాక్టర్ల ద్వార సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్దిపేట నుంచి రెండు వేల మంది యువత పాదయాత్రగా ముల్కనూరు వరకు చేరుకున్నారు. వీరు సభా ప్రాంగణానికి ఆదివారం సాయంత్రం చేరుకుంటారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి రజతోత్సవ సభకు సుమారుగా రెండు లక్షల మంది జనం తరలివెళ్లనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ తొవ్వ ఖర్చులకు కూలి పనిచేసి వచ్చిన డబ్బులతో వాహనాల ఖర్చులకు సమకూర్చున్నారు.
బెజ్జంకి మండ లం లక్ష్మీపూర్‌లో మహిళా నేతలు కూలీ పనిచేసి తొవ్వ ఖర్చులు సిద్ధం చేసుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇలా తొవ్వ ఖర్చులకు సిద్ధం చేసుకున్నారు. ఉద్యమాల పురిటి గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా ఆది నుంచి బీఆర్ఎస్కు అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ప్రాంత బిడ్డ కావడంతో అన్ని సందర్భాల్లో ప్రజలంతా ఆయనకు అండగా నిలిచారు. బీఆర్ఎస్ స్థాపించి 25ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుండి రెండు లక్షలకు పైగా జనం తరలివెళ్లనున్నారు.
గులాబీమయంగా సిద్దిపేట-హన్మకొండ రహదారి…
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నేడు జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.గులాబీ తోరణాలు కట్టారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలతో రహదారి కనిపిస్తున్నది. పల్లెపల్లెనా వాల్ రైటింగ్ వేశారు. సభ ప్రచార పోస్టర్లను గోడలపై అతికించారు. చలో వరంగల్ అంటూ పెద్ద ఎత్తున వాల్ రైటింగ్‌ను స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్యనాయకుల పేర్ల మీద రాయించారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించుకున్నారు. సభకు వెళ్లేందుకు వాహనాలు, భోజనం, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేసుకున్నారు.
పార్కింగ్ జోన్ -5
సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూరు, గోపులాపూర్ క్రాస్‌రోడ్డు మీదుగా ఇందిరానగర్ వద్ద పార్కింగ్ జోన్-5 వద్ద జిల్లా నుంచి వెళ్లిన వాహనాలను పార్కింగ్ చేస్తారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, ఖానాపూర్, బోథ్, ముథోల్ నియోజకవర్గాల నుంచి ఈ రూట్లో జనం తరలివెళ్లనున్నారు.
నేడు పార్టీ జెండా ఆవిష్కరణలు
నేడు అన్ని గ్రామాల్లో, వార్డులో గులాబీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పార్టీ జెండా గద్దెలకు రంగులు వేయడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ బొమ్మలను వేశారు. పార్టీ జెండాలను సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లో గులాబీ శ్రేణులు పార్టీ జెండాలను ఉదయమే ఆవిష్కరించి దూరం భారం అనుసరించి సభకు బయలుదేరుతారు. కొన్ని ప్రాంతాల నుంచి ఉదయమే ప్రయాణం కానుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వాహనాల్లో తరలివెళ్లనున్నారు.
పాదయాత్రకు హరీశ్‌రావు సంఘీభావం
బెజ్జంకి, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో యూత్ సభ్యులు పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు. వీరికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం సంఘీభావం తెలిపి అభినందించారు. పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్‌గుప్తా, రాజు, తిరుపతి, బాలనర్సు, సుదర్శన్, దీలిప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజూ కొనసాగిన పాదయాత్ర
నంగునూరు, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి యువజనుల పాదయాత్ర రెండోరోజు నంగునూరు మండలం బద్దిపడగ వద్ద ప్రారంభమైంది. శనివారం బద్దిపడగ నుంచి బయలుదేరిన పాదయాత్ర కోహెడ మండలం సముద్రాల వరకు చేరుకుంది. పాదయాత్రకు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నంగునూరు నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, లింగంగౌడ్ తదితరులు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.