తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తున్నది. అన్ని మతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో పూర్తి నిరాదరణకు గురైన ఆలయాలు, మసీదులు, చర్చీలను రాష్ట్ర ప్రభుత్వం రూ,కోట్ల నిధులు మంజూరు చేసి పునరుద్ధరిస్తున్నది. ప్రతి పేదవాడు పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కానుకలు అందిస్తున్నది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించడంతోపాటు అర్చకులకు వేతనం ఇస్తున్నది. ప్రసిద్ధ ఆలయాల కింద ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ), జూన్ 20
మెదక్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఉమ్మడిపాలనలో మెదక్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సేవలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేయడంతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత క్షేత్రాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు పెరగడంతో ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. 400 సంవత్సరాల క్రితం మెదక్ సమీపంలో ఈ ఆలయం వెలసింది. శివ్వంపేట మండలం ప్రముఖ ఆలయాలతో ఉమ్మడి జిల్లాలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంటున్నది. మండలంలోని చిన్నగొట్టిముక్ల సమీపంలో అటవీప్రాంతంలో స్వయంభు ఆంజనేయస్వామి, సికింద్లాపూర్‌లో ఏడువందల సంవత్సరాల క్రితం నాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, దొంతిలో ఐదువందల ఏండ్లనాటి వేణుగోపాలస్వామి ఆలయం, శివ్వంపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన బగలాముఖి శక్తిపీఠం శివ్వంపేట మండలానికే ప్రత్యేకంగా నిలిచాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్‌లోని కెథడ్రల్ చర్చి ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. దీని నిర్మాణం 1924లో పూర్తయింది.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆలయాలకు ధూప, దీప నైవేద్యం పథకం అమలుచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆలయాలన్నింటికీ ప్రతినెలూ ధూప దీప నైవేద్యం పథకం కింద పూజాకార్యక్రమాల కోసం రూ.6వేలు అందజేస్తారు. మెదక్ జిల్లాలోని 93 ఆలయాలకు లబ్ధి చేకూరుతున్నది. ధూప, దీప, నైవేద్యాల కింద నిధులను రూ.10వేలకు పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. బ్రాహ్మణ పరిషత్ నుంచి వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న భృతిని రూ.2, 500 నుంచి రూ.5 వేలకు పెం చారు. ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గించారు.
సంగారెడ్డి జూన్ 20(నమస్తే తెలంగాణ): ఉమ్మడిరాష్ట్రంలో ప్రజలతోపాటు ఆలయాలూ నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణలోని ఆలయాలను ఆంధ్రపాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఎంతో ప్రసిద్ధ్దమైన, ప్రాముఖ్యత గల ఆలయాలు వైభవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సేవలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. ఫలితంగా సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని 22 ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.4,10,76,667 నిధులను మంజూరు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కేతకి సంగమేశ్వరాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఆలయంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించింది. కేతకి సంగమేశ్వరాలయం మాస్టర్ ప్లాన్ పనులను త్వరలో చేపట్టి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నది. న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం అభివృద్ధికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆలయంలో అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. కోహీర్ బండంపేట రాచన్న ఆలయం, అమీన్పూర్ శివాలయం, బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధ్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తుంది. ఆలయాల అభివృద్ధిలో భక్తులను భాగస్వాములను చేయాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ డోనర్ పథకం కింద విరాళాలు స్వీకరిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో రూ.8.75 కోట్ల విరాళాలను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేశారు. జిల్లాలో పుష్కరాలు, జాతరలు, పండుగలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల న్యాల్కల్ మండలం మంజీరానదిలో గరుడగంగ పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం రూ.50 లక్షలతో మౌలిక వసతులు కల్పించింది.
ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాలోని ఆలయాలు ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారు. అర్చకులు, మసీదుల ఇమామ్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తున్నది. ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని 262 ఆలయాలకు నిధులు విడుదల చేస్తోంది. 262 ఆలయాల్లో ధూపదీప నైవేద్యానికి అయ్యే ఖర్చులు ఇస్తూనే అర్చకులకు రూ.10వేల వేతనాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సేవలు అందించే 90మంది అర్చకులకు వేతనాలను అందజేస్తుంది. వీరికి ప్రతిఏటా వేతన రూపంలో రూ.4,80,03,984 అర్చకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది.
టేక్మాల్ జూన్ 20: మండలకేంద్రంలోని ఎల్పుగొండలో ఎక్కడచూసినా శిల్పాలు, దేవతావిగ్రహాలు అడుగుఅడుగునా మనకు దర్శనమిస్తాయి. 13వ శతాబ్దంలో పాలించిన కాకతీయుల కాలంలో ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. తుంబురీశ్వరాలయ పైభాగ నిర్మాణం వరంగల్‌లోని వెయ్యి స్థంభాల గుడి నిర్మాణం ఒకేవిధంగా ఉండడం, ఆలయాన్ని పూర్తిగా నల్లరాయితో నిర్మించారు. గాన గంధర్వుడైన తంబురుడు ఇక్కడే జన్మించాడని, ఆయననే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని, అందుకే తుంబురీశ్వరాలయంగా పిలువబడుతున్నట్లుగా ప్రచారంలో ఉంది.
పెద్దశంకరంపేట జూన్20: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయం పెద్దశంకరంపేట మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌కు ఆనుకొని ఉంది. ఆలయం చుట్టూ నీరు,ప్రకృతి ప్రతిబింబించేలా ఉన్నది. ప్రతి శివరాత్రికి నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు.
సంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు గతంలో రాజులు, జమీందారులు, ధర్మకర్తలు భూములు ఇచ్చారు. ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఆలయ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన 49.01 ఎకరాల భూములను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.