నంగునూరు, జూన్ 27: ఆగస్టు మొదటివారంలోపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సిద్దిపేట కలెక్టర్ హైమావతి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణలోనే మొదటి రిఫైనరీ ఫ్యాక్టరీ అన్నారు. తెలంగాణకు సిద్దిపేట గుండెకాయలాంటి ప్రాంతం అని, ఏ జిల్లా నుంచి అయినా ఇక్కడికి ఆయిల్‌పామ్ తీసుకురావచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను బాగు చేసేందుకు రైతాంగాన్ని నష్టపర్చే పరిస్థితి మంచిది కాదన్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి దిగుమతి సుంకం పెంచాలని డిమాండ్ చేస్తామన్నారు. లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని నిలిపే శక్తి తెలంగాణ రైతులకు ఉందని ఆయన పేర్కొన్నారు.