హుస్నాబాద్ టౌన్, జూన్ 6: రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ హుస్నాబాద్ సమీపంలో నర్మెటలో వచ్చేనెల అందుబాటు లోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. హుస్నాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే రైతు మహోత్సవాన్ని శుక్రవారం బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకు ముందు మంత్రులు ఇద్దరు ఎద్దుల బండిపై హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు చేరుకున్నారు.
యార్డులో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, హార్టికల్చర్, సెరికల్చర్‌తో పాటు పలురకాల ఉత్పత్తుల స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 31జిల్లాల్లో ఆయిల్‌పామ్ పంట సాగువున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతుల కోసం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధమైందని, జూలైలో ప్రారంభింస్తామని వెల్లడించారు. హుస్నాబాద్‌లో గోడౌన్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుతున్నారని, స్థలం ఇస్తే గోడౌన్ మంజూరు చేస్తామని చెప్పారు.
భూమి పెరగదని, ఉన్న భూమిలోనే రైతులు కొత్త విధానాలతో ఆదాయాన్ని పెంచుకోవాలని, మానవాళికి కావాల్సిన పంటలను నాణ్యతతో పండించాలని సూచించారు. మన తాతలు రెండుకిలోల యూరియా వాడితే, మనం 150 కిలోలు వాడుతున్నామని, దీంతో మన పంటలు విదేశాలు కొనేందుకు ముందుకు రావడం లేదన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని మనం మరిచి పోవడంతో మన పంటలకు గిరాకీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఆలోచనలు, నూతన పరిజ్ఞానాన్ని రైతులకు ప్రభుత్వం చేరువ చేస్తున్నదని, ఇప్పటికే వెయ్యిగ్రామాలను శాస్త్రవేత్తలు సందర్శించి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.
రైతు మహోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఎరువులు, విత్తనాలు, యంత్రా లు, వివిధ కంపెనీల ఉత్పత్తులతో పాటు పలు విభాగాలకు చెందిన 134 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు స్టాళ్లను తిలకించి విత్తనాలు, కొత్త వంగడాల గురించి తెలుసుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తనవంతు కృషిచేస్తున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంటలు సాగుచేయాలన్నారు. వాణిజ్య పంటలు, యాంత్రీకరణతో రైతులు అభివృద్ధి సాధించాలని కోరారు. హుస్నాబాద్ ప్రాంత రైతులు తెలంగాణకు ఆదర్శంగా నిలిచేలా తయారుకావాలని అకాంక్షించా రు.
హుస్నాబాద్ ప్రాంతాన్ని వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, విద్యా, పర్యాటక పరంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయ ల నాగేశ్వర్రావు, వ్యవసాయశాఖ కమిషనర్ గోపి, కలెక్టర్ ఎం. మనుచౌదరి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కేడం లింగమూర్తి, కంది తిరుపతిరెడ్డి, బొలిశెట్టి శివయ్య, అధికారులు,నిపుణులు, రైతులు పాల్గొన్నారు.