మెదక్ రూరల్/కౌడిపల్లి, జూన్ 6: మెదక్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతిచెందారు. హవేళీఘనపూర్ మండలంలో ఇద్దరు, కౌడిపల్లి మండలంలో ఒకరు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య(50), ఓడంగల నందు (22) ఇద్దరు కలిసి బుధవారం దుర్గమ్మ గుట్టకు గడిసెపైన కప్పే పొరక తేవడానికి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన రావడంతో బండ పక్కనే ఉన్న చెట్టు కింద నిలుచున్నారు. కొద్దిసేపటికి వారిపై పిడుగు పడడంతో సిద్ధయ్య,నందు అక్కడిక్కడే మృతిచెందారు. రాత్రయినా ఈ ఇద్దరు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ,గ్రామస్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి వెతికారు. రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. పక్కనే ఉన్న బండపై పిడుగు పడిన ఆనవాళ్లు గుర్తించినట్లు వారు తెలిపారు.
కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన గెమ్యానాయక్(53) గురువారం రోజుమాదిరిగా గొర్రెలు మేపడానికి వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో గొర్రెలు మేపుతుండగా సలాబత్పూర్ గ్రామ శివారులో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు.