చేగుంట: అక్టోబర్ 5 : బైకు దొంగతనానికి వచ్చిన దొంగలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు.
ఆదివారం చేగుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన బందెల మోహన్ అలియాన్ యోహన్, ఎర్రోల్ల మహిపాల్ ఇద్దరు వడియారం గ్రామంలో గల మహిపాల్ అత్తగారి ఇంటికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో గుండ్ల రమేశ్ బైక్‌పై వెళ్తుండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో వారిని దొంగలుగా భావించి, వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో దొంతి రామకృష్ణ, గుండ్ల రమేశ్, మరికుక్కల అనిల్‌లు మోహన్ జేబులో పెట్రోలుతో ఉన్న బాటిల్‌ను గమనించారు. ఆ బాటిల్ లాక్కుని వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరికొందరు అప్రమత్తమై, దొంగకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన దొంగను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మోహన్ స్టేట్మెంట్ ఆధారంగా దొంతి రామకృష్ణ, గుండ్ల రమేశ్, మరికుక్కల అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఇంకా ఎవరికైనా సంబంధం ఉంటే వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.