కంగ్టి, మే 5: పెండ్లికోసం సొంత గ్రామానికి వచ్చిన తల్లీకూతుళ్లను మృత్యువు వెంటాడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గిలో మంగళవారం బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మృతిచెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం బోర్గికి చెందిన పరశురామ్, సావిత్రి దంపతులు పొట్టకూటికోసం హైదరాబాద్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పరశురామ్ ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బంధువుల పెండ్లి ఉండడంతో వారంరోజుల క్రితం గ్రామానికి కుటుంబంతో వచ్చాడు. మంగళవారం సావిత్రి (30), నిఖిత (10), నందిని (8) గ్రామ పొలిమేరలో ఉన్న బావి వద్ద బట్టలు ఉతకడానికి మధ్యాహ్నం సమయంలో వెళ్లారు.
ప్రమాదవశాత్తు బావిలో నందిని మొదట జారిపడగా, ఆమెను కాపాడటానికి నిఖిత, సావిత్రి బావిలో పడ్డారు. ఇది గమనించిన ఇంకో కూతురు శివానీ ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. వెంటనే గ్రామస్తులు వచ్చి బావి నుంచి వారిని వెలికి తీసేసరికి ముగ్గురు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిఖిత మొగుడంపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో చదువుతుండగా, నందిని సిర్గాపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో చదువుకుంటుంది. గ్రామంలో ఒకేసారి ముగ్గురు మృతిచెందడంతో విషాదం నెలకొంది. మృతుల్లో తల్లీకూతురు సావిత్రి, నిఖిత కాగా, మరో అమ్మాయి నందిని కూడా అదే కుటుంబానికి చెందినది.