అమీన్పూర్ మార్చి 28: అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా నేలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన అవురిజింతల చెన్నయ్య 20 ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని వాటర్ ట్యాంకర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చెన్నయ్యకు 2005లో వివాహం జరగ్గా మొదటి భార్య ప్రమాదవశాత్తు ప్రసవ సమయంలో కిందపడి చనిపోయింది.
అనంతరం రజితను రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఇద్దరు మగ పిల్లలు సాయికృష్ణ (12) గౌతమ్ (8) ఒక ఆడపిల్ల మధుప్రియ(10) జన్మించారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు గానీ, మనస్పర్థలు గానీ ఉన్నట్లు ఎప్పుడూ చూడలేదని, అన్యోన్యంగా జీవిస్తున్నారని స్థానికులు తెలిపారు. రజిత ఎస్పి కిడ్స్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుందని, ముగ్గురు పిల్లలు పక్కనే ఉన్న డార్విన్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రజిత పిల్లలకు పెరుగన్నం తినిపించి పడుకో పెట్టింది.
చెన్నయ్య భోజనం చేసి అనంతరం వాటర్ ట్యాంకర్‌తో చందానగర్‌కు నీటి సరఫరా కోసం వెళ్లి రాత్రి 11గంటలకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో పిల్లలు నిద్రపోతుండగా భార్య రజిత తలుపులు తెరిచింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి బిగ్గరగా అరిచింది. భార్య అరుపులతో చెన్నయ్య లేచి ఇరుగుపొరుగు వారి సహాయం తో బీరంగూడలోని పనేసియా మెరిడియన్ దవాఖానకు తరలించాడు. ఇంటిలో పడుకున్న పిల్లలు అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు.
తెల్లవారుజామున పిల్లలు విషపదార్థం తినడంతో మృతిచెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రజిత కూడా విష పదార్థం తిని దవాఖానలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఫోరెన్సిక్ విభాగం అధికారులు కూడా పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. విచారణ నిమిత్తం తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.