మిరుదొడ్డి, సెప్టెంబర్ 22 : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎలాంటి షరతులు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ వీడియోలు’ ట్విటర్, ఫేస్ బుక్కు ద్వారా పంపే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ చేశామని జబ్బలు చరుచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీకు రైతులు గట్టి జవాబు చెబుతూ సెల్ఫీ వీడియోలు తీసి పంపారన్నారు. ఒక్క ధర్మారం గ్రామంలోనే రుణమాఫీ కాని 400 మంది రైతులు మానసికంగా ఇబ్బందులు పడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సెల్ఫీ వీడియోలు తీసి పంపారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశామని మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్పితే సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.
ఈనెల 18న రుణమాఫీ కాని రైతులు మిరుదొడ్డి తహసీల్ కార్యాలయం వద్దకు 1000 మంది వరకు వచ్చి ధర్నా చేస్తే, బీఆర్ఎస్ నాయకులు వారికి డబ్బులు ఇచ్చి తీసుకువచ్చి ఆందోళన చేయించారని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి, ఇప్పుడు అందరినీ మోసం చేస్తున్నాడని విమర్శించాడు. మీ మాటలకు మోసపోయిన రైతులు తమ బాధలను సెల్ఫీ వీడియోలు తీసీ సీఎంవోకు ట్యాగ్ చేసి పంపిస్తున్నారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు వీడియోల ద్వారా డిజిటల్ ర్యాగింగ్ చేస్తారని హెచ్చరించారు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా 1500 మంది రైతుల నుంచి డిజిటల్ వీడియోలు సీఎంవోకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెల్ఫీ వీడియో ఉద్యమం లేపడం ఖామయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, మాజీ సర్పంచ్‌లు తుమ్మల బాల్‌రాజు, జోగ్గారి బాల్‌నర్సయ్య, నాయకులు సూకురి లింగం, తీపిరెడ్డి దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మైసయ్య, పర్శరాములు, నారాయణ, మల్లేశం గౌడ్, భిక్షపతి, బాల్‌రాజు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సార్ నిన్ను రూ.2 లక్షల రుణమాఫీ చేయమని రైతులము అడిగినామా.అప్పుడు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఇత్తమని మీరే చెప్తిరి. ఇప్పుడేమో చెయ్యక పోతిరి. పక్కోనికి అచ్చే మాకు రుణమాఫీ రాకపోయే. రేవంత్‌రెడ్డి అన్ని మాయమాటలు చెప్పుతుండు. నాకు రూ.2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉంటే నేను బ్యాంకులో పైన డబ్బులు కట్టిన. కానీ, నాను ఇప్పటికి లోన్ మాఫీ కాలేదు. అందుకే సీఎంకు నా సెల్ఫీ వీడియోను తీసి పంపుతున్న.
-కరికే మైసయ్య, రైతు, ధర్మారం, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా
నాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటిలా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. మా రైతులకు అప్పుడు అన్ని అచ్చినయి. ఇప్పుడు రైతులకు ఏది వస్తలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతది.
– కొమురయ్య, రైతు, ధర్మారం, మిరుదొడ్డి మండలం,సిద్దిపేట జిల్లా