సంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అన్నపూర్ణ పథకం పేదల పాలిట వరంగా మారనున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో సీఎం కేసీఆర్ ప్రకటించిన అన్నపూర్ణ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రకటనపై సంగారెడ్డి జిల్లాలోని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలందరినీ దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పేదలకు సన్న బియ్యం బువ్వ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. అన్నపూర్ణ పథకంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగనున్నప్పటికీ సీఎం కేసీఆర్ పేదలకు సన్న బియ్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుని, మ్యానిఫెస్టోలో అన్నపూర్ణ పథకం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో 3.78 లక్షల రేషన్‌కార్డుదారులకు లబ్ధి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సన్న బియ్యం అందజేస్తున్నది. తాజాగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేస్తామని ప్రకటించా రు. సంగారెడ్డి జిల్లా లో పేదలు సన్న బి య్యం అన్నం తింటామని సంబురంగా ఉ న్నారు. జిల్లాలో 3,78,789 రేషన్‌కార్డులున్నాయి. ఆయా రేషన్‌కార్డులపై 12,35,514 మంది కుటుంబ సభ్యులు బియ్యం అందుకుంటున్నారు. జిల్లాలోని 846 చౌకధరల దుకాణాల ద్వారా 3,78,789 రేషన్‌కార్డులపై ప్రతినెలా 7992.77 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 3,52,483 తెల్లరేషన్‌కార్డులున్నాయి.
ఈ రేషన్‌కార్డులపై ప్రతినెలా 7004.56 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వం అందజేస్తున్నది. 26206 అంత్యోదయ కార్డులపై ప్రతినెలా 917.21 టన్నులు, 100 అన్నపూర్ణ కార్డులపై టన్ను దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందజేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలోని 3,78,789 రేషన్‌కార్డుదారులు సన్న బియ్యం లబ్ధిపొందనున్నారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం తిన్న 12.35 లక్షల మంది రేషన్లబ్ధిదారులు అన్నపూర్ణ పథకం అమలుతో సన్న బియ్యంతో భోజనం చేయనున్నారు. ప్రభుత్వం అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేయనుండటంతో పేదలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు తమకు సన్న బియ్యం బువ్వ పెడతామంటున్న కేసీఆర్‌ను మరోమారు సీఎంను చేస్తామని ఆనందంగా చెబుతున్నారు.