హుస్నాబాద్, మే 22: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు ఎత్తుకెళ్తున్నారు. తన మొక్కజొన్న బస్తాలు ఎత్తుకెళ్లినట్లు మార్కెట్ అధికారులకు అక్కన్నపేట మండలం గండిపల్లికి చెందిన రైతు ముడావత్ నిమ్మా ఫిర్యాదు చేశాడు. వారం క్రితం మార్కెట్‌కు మక్కలు తెచ్చానని, మక్కలు రాసిగా పోసి.. కొన్ని బస్తాల్లో నింపి చుట్టూ పెట్టినట్లు రైతు చెప్పాడు. బుధవారం వచ్చి చూసే సరికి చుట్టూ పెట్టిన 15 మక్కల బస్తాలు కనిపించడం లేదన్నాడు.
సుమారు 7క్వింటాళ్ల మక్కలు పోయాయని మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు చూసి విచారణ జరుపుతామని మార్కెట్ అధికారులు చెప్పారని, రెండు రోజులు గడిచినా ఏం చెప్పడం లేదని రైతు నిమ్మా ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో మార్కెట్‌యార్డులో రైతులు పోసుకున్న పొద్దుతిరుగుడు పంట బస్తాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే దొంగతనాలు జరుగుతున్నాయని, యార్డులో కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.