మెదక్, (నమస్తే తెలంగాణ)/మున్సిపాలిటీ/నర్సాపూర్, ఏప్రిల్ 2: ఏ ఒక్క రేషన్ దుకాణంలో సన్నబియ్యం నిల్వ లేదని ఫిర్యాదు రాకూడదని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ 15 వార్డులో, హవేళీఘనపూర్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని తెలుసుకున్నారు. బియ్యం పంపిణీలో లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 2,13,820 మందికి ప్రతి నెల 4430.496 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా అందిస్తారన్నారు. లబ్ధిదారులకు ఒకొకరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణంలో, రామాయంపేటలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబులతో కలిసి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు.