హుస్నాబాద్ టౌన్, మే 20: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు నాసిరకంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆధునీకరణ పనులు నాణ్యతతో చేపట్టలేదని, దీంతో చిరుజల్లులకే బస్టాండ్‌లో లీకేజీలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ బస్టాండ్ నిర్మాణ సమయంలో తూర్పువైపు మూత్రశాలలు నిర్మించారు. ఇటీవల ఆధునీకరణలో భాగంగా పడమరలో నూతనంగా మూత్రశాలలు నిర్మించారు. తూర్పువైపు నిర్మించిన మూత్రశాలలు మూడు వారాలుగా మరమ్మతుల పేరుతో మూసివేశారు. దీంతో ప్రయాణికులు మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా నిర్మించిన మూత్రశాలల ప్రాంతంలో కట్టిన మెట్లను ఎక్కలేక వృద్ధులు, మహిళలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
Medak3
చిరుజల్లులతో లీకేజీలు…
హుస్నాబాద్ ఆర్టీస్ బస్టాండ్‌ను ఇటీవల రూ.2.50 కోట్లతో ఆధునీకరించారు. బస్టాండ్ చుట్టూ ఫెన్సింగ్, గ్రానైట్‌తో కొత్త ప్ల్లాట్ఫాంలు, టాయిలెట్స్, పూర్తిస్థాయిలో సీసీ, గార్డెన్ తదితర పనులు చేపట్టారు. కోట్లరూపాయలతో పనులు చేపట్టినప్పటికీ చిరుజల్లులకే భవనం లీకేజీలు అవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో నిలిచే వరద నీరు బయటకు వెళ్లేందుకు పైపులైన్ నిర్మాణం చేపట్టకుండా హడావిడిగా పనులు పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వాన కురిస్తే బస్టాండ్ పరిసరాలు వరదతో నిండిపోతున్నది. వర్షం నీరు బయటకు వెళ్లేందుకు పైపులైన్ నిర్మాణం, ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఏర్పాటు చేయకపోవడంతో వరద బస్టాండ్ ఆవరణలోనే నిలుస్తున్నది.
మంత్రి దృష్టి సారించాలి
హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణ పనులకు గతేడాది మార్చి 8న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జనవరి 23న ప్రారంభోత్సవం చేశారు. దాదాపు రూ.2.50 కోట్ల నిధులు ఆధునీకరణకు వెచ్చించడంపై ప్రజల్లో హర్షం వ్యక్త అయ్యింది. కానీ, పనుల్లో నాణత్య కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి ఇలాకాలోనే చేసిన పనులకు లీకేజీలు, అస్తవ్యస్తంగా ఉండటం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రిపొన్నం ప్రభాకర్‌గౌడ్ బస్టాండ్ ఆధునీకరణ పనులపై సమీక్ష నిర్వహించి, ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.